Movies

అక్కినేనికి వెన్నుదన్నుగా నిలిచిన దుక్కిపాటి

The man who held strong friendship with ANR-Dukkipati Madhusudhana Rao

దుక్కిపాటి మధుసూదనరావు (జూలై 17, 1917 – మార్చి 26, 2006) అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి ఒక్కరు. దుక్కిపాటి మధుసూదనరావు తనని అమ్మకన్నా మిన్నగా పెంచి పోషించిన సవతితల్లి అన్నపూర్ణ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దానికి అక్కినేని నాగేశ్వరరావుని ఛైర్మన్‌ని చేశారు. ఆ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు చిత్రం నిర్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో అక్కినేని, సావిత్రి ల జంట కన్నుల పండువుగా నటించడంతో అది ఘనవిజయం సాధించింది. దుక్కిపాటి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు మిత్రులు, డాక్టర్‌ చక్రవర్తి, ఆత్మ గౌరవం, పూలరంగడు, విచిత్రబంధం, ప్రేమలేఖలు, రాధాకృష్ణ, పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి… వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు. డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం. పెళ్లీడు పిల్లలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘనవిజయం సాధించాయనడంలో సందేహం లేదు. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమాగా ఇద్దరు మిత్రులు. అన్నపూర్ణ సంస్థ నిర్మించే సినిమాలకు ఎక్కువగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించే వారు. దుక్కిపాటి తన సినిమాలలో కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ (సంభాషణల రచయిత్రి), కె.విశ్వనాథ్ (దర్శకుడు), ఆశాలత కులకర్ణి, రామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద వంటి కళాకారులను పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారు. అందుకే ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. రెండు శరీరాల్లో ఉన్న ఒకే ఆత్మ స్నేహం అంటారు. దాన్ని దుక్కిపాటి, అక్కినేని- ఇద్దరూ నిరూపించారు.