అమెరికాలో కొరోనా మహమ్మారి లక్ష మందికి సోకినప్పటికీ తెలుగువారు ఈ వైరస్ బారి నుండి సురక్షితంగా ఉన్నట్లు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. అమెరికాలో లక్ష మందికి సోకిన ఈ వైరస్ వలన ఇప్పటికే 2700 మంది ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం రోగులు న్యూయార్క్ రాష్ట్రం నుండే ఉండటం ఆందోళన కలిగించే అంశమని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎవరూ తమకు కొరోనా సోకినట్లు తానాను సంప్రదించలేదని, ఒహాయో, ఫ్లోరిడాలకు చెందిన విద్యార్థులు నిర్వాసితులు కాగా వారికి వసతి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. భారత కాన్సులేట్లతో కలిసి కోవిడ్19 అవగాహనా సదస్సులు, తానా వైద్యుల బృందంతో ఈ-వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై పోరాడుతున్న ఆరోగ్య రంగ ఉద్యోగులకు ఆయన తానా తరఫున ధన్యవాదాలు తెలిపారు. స్వీయ నిర్బంధం ఈ పరిస్థితుల్లో దేశసేవతో సమానమని, దయచేసి అందరూ తమ గృహాలకు పరిమితమయి ఈ మహమ్మారిపై పోరులో సహకరించాలని జయశేఖర్ విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో తెలుగువారు సురక్షితం-జయశేఖర్
Related tags :