Business

మీకు ఇండియాలో గృహఋణం ఉందా?

Home Loans Interest Rates Will Reduce Due To RBI Repo Rate

రుణగ్రహీతలకు ఆర్‌బీఐ శుక్రవారం పెద్ద శుభవార్తనే వినిపించింది. రెపో రేటును 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం ద్వారా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని అతితక్కువ స్థాయి 4.4 శాతానికి తీసుకొచ్చింది. ఈ చర్యవల్ల రెపోతో అనుసంధానమైన అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యవధి ఉండే గృహ, వాహన రుణాలపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపనుంది. గత ఏడాది అక్టోబరు 1 నుంచి బ్యాంకులన్నీ ఏదో ఒక ప్రామాణిక సూచీని ఆధారంగా చేసుకొని రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడం ప్రారంభించాయి. దాదాపు అన్ని బ్యాంకులూ తమ చలన వడ్డీ రేట్లను ఆర్‌బీఐ రెపో రేటుకు అనుసంధానం చేసుకున్నాయి. దీని ఆధారంగా ఈబీఆర్‌ (ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటు)ను నిర్ణయిస్తున్నాయి. ఉదాహరణకు ఎస్‌బీఐని తీసుకుంటే.. గృహ రుణాలపై రెపో రేటుకు అదనంగా 2.65శాతాన్ని వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు ఇప్పటివరకూ ఉన్న 5.15శాతం రెపోరేటుకు అదనంగా 2.65శాతం కలిపి 7.80శాతం వడ్డీకి గృహ రుణం ఇస్తోంది. ఆర్‌బీఐ రెపో రేటును 4.4 శాతానికి తగ్గించిన నేపథ్యంలో 4.4%+2.65%=7.05శాతానికి ఇది చేరనుంది. దాదాపు అన్ని బ్యాంకులు 0.5శాతం నుంచి 1శాతం వరకూ అటూఇటూగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి.

బ్యాంకులు ఇప్పటికీ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారంగా వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. రుణగ్రహీతలు వడ్డీ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని పొందాలంటే.. వెంటనే తమ రుణాలను రెపో అనుసంధాన రుణానికి (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)కు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం రుణం తీసుకున్న బ్యాంకును సంప్రదించి, దరఖాస్తు చేసుకోవాలి. రుణ మొత్తం అసలులో 0.5శాతం లేదా గరిష్ఠంగా రూ.5,000-10,000 మధ్య రుసుమును వసూలు చేసి, వడ్డీ రేటును మారుస్తున్నాయి. ఉదాహరణకు.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.30 లక్షల లోపు గృహ రుణాలకు ఇప్పటి వరకూ 7.80 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 75 బేసిస్‌ పాయింట్లు తగ్గడంతో పాటు బ్యాంకు కూడా ఆమేరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ఆ బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు 7.05 శాతానికి పరిమితమవుతుంది.