అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమవుతోంది. మృతుల సంఖ్య కేవలం మూడు రోజుల్లో రెండింతలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఉదయానికి కరోనా మృతుల సంఖ్య 2,238కు చేరింది. ఈ నెల 26న అంటే గురువారం నాటికి 1000గా నమోదైన మరణాల సంఖ్య కేవలం మూడు రోజుల్లోనే రెట్టింపయింది. ఇక వైరస్ బారిన పడ్డవారి సంఖ్య 124385కు చేరింది. కొత్త కేసుల సంఖ్యలోనూ అమెరికా కొత్త రికార్డు నెలకొల్పింది. శనివారం ఒక్కరోజే కొత్తగా వైరస్ సోకిన వారి సంఖ్య 23 శాతం పెరగడం గమనార్హం. అయితే అక్కడ విస్తృతంగా పరీక్షలు జరపడం వల్లే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలోనే సగానికి పైగా బాధితులు ఉండడం గమనార్హం. మృతుల్లోనూ మూడో వంతు ఈ రాష్ట్రానికి చెందినవారేనని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో న్యూయార్క్ మొత్తాన్ని క్వారంటైన్‌లో పెట్టే దిశగా సమాలోచనలు జరపుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇల్లినాయిస్ నగరంలో ఓ శిశువు కరోనా వైరస్ బారిన పడి మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా వయసు పైబడిన వారు మాత్రమే మరణిస్తున్నట్లు ఇప్పటి వరకు ఉన్న అంచనా. చిన్నారులు, యుక్త వయస్కులు చాలా అరుదుగా మరణిస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ఓ 16 ఏళ్ల బాలిక చనిపోయింది. ఇప్పటి వరకు అదే అతితక్కువ వయసు. తాజాగా అమెరికాలో అంతకంటే తక్కువ వయసు చిన్నారి చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ శిశువు వయసు మాత్రం వెల్లడించలేదు.
అమెరికాలో 124385కేసులు. 2238 మరణాలు.
Related tags :