ప్రస్తుతం అమెరికాను కబళిస్తున్న కరోనా వైరస్ అమెరికా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని దాని ప్రభావం భారతీయులపైన, మన తెలుగువారిపైనా తప్పకుండా ఉంటుందని సిలికినాంధ్ర వ్యవస్థాపకుడు, ప్రముఖ సామాజికవేత్త కూచిభొట్ల ఆనంద్ TNIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుందని, దీని ప్రభావం పలు పముఖ కంపనీలపైన ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని మూలంగా చాలా మంది భారతీయులు, తెలుగువారు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆనంద్ తెలిపారు. హెచ్1 పైన, తాత్కాలిక ఉదోగాల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆనంద్ ఆవేదన వ్యక్తపరిచారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న తెలుగు విద్యార్ధులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. కరోనా కారణంగా రూపాయి విలువ పడిపోతుందని, డాలరు బలపడుతుందని దీని ప్రభావం భారత్ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని, ఎగుమతి దిగుమతుల వ్యవహారాలూ సంక్షోభంలో పడతాయని తెలిపారు. కాలిఫోర్నియాలో లాక్ డౌన్ కార్యక్రమాన్ని భారత్ లో లాగానే నిర్భంధంగా అమలు చేస్తున్నారని దీని మూలంగా కరోనా ఉద్ధృతి తగ్గుతోందని తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ఉన్న తెలుగు వారంతా క్షేమంగా ఉన్నారని, సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు తెలియ చెప్పుకుంటున్నామని ఆనంద్ తెలిపారు. ఇంట్లోనే గడపడం, శుభ్రతను పాటించడం, మరొకరి ఇంటికి వెళ్ళకుండా ఉండటం అనే నియమాలను పాటిస్తున్నామని, దీని మూలంగా త్వరలోనే కరోనా వైరస్ ను పారదోలతామని వారు తెలిపారు. ఆపదలో ఉన్న తెలుగు వారు తమను సంప్రదించాలని, తాము చేయగలిగిన సహాయ సహకారాలను అందిస్తామని ఆనంద్ పేర్కొన్నారు. -కిలారు ముద్దుకృష్ణ
అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం…TNI ముఖాముఖిలో కూచిభొట్ల ఆనంద్
Related tags :