WorldWonders

ఓ గర్భవతి…100కి.మీ. నడక

Uttar Pradesh Pregnant Lady Walks 100KM To Reach Home Town Due To LockDown

దేశమంతా మూసివేత ఉత్తర్వులు అమల్లో ఉన్న నేపథ్యంలో… స్వగ్రామం చేరుకోవటం కోసం ఎనిమిది నెలల గర్భిణి తన భర్తతో కలసి ఆహారం కూడా లేకుండా కాలినడకన 100 కిలోమీటర్లు ప్రయాణించింది. దాదాపు అపస్మారక స్థితికి చేరుకొన్న ఆమెకు పోలీసులు పరిచర్యలు చేసి, వారి గ్రామాన్ని చేరటానికి సహకరించటంతో కథ సుఖాంతమైంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహ్రాన్‌పూర్‌లోని ఓ కర్మాగారంలో వకీల్‌ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అతను పనులను కోల్పోవటంతో పాటు… నివాసాన్ని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఊరికి వెళ్లడానికి కూడా యాజమాన్యం డబ్బు ఏమీ ఇవ్వలేదు. దీనితో చేసేదేం లేక వకీల్‌, గర్భిణి అయిన తన భార్య యాస్మిన్‌తో కలసి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోనున్న వారి గ్రామం అమర్‌ఘడ్‌కు కాలినడకనే బయల్దేరాడు. జాతీయ రహదారి వెంట ఉన్న భోజనశాలలన్నీ మూతపడటంతో రెండురోజులుగా ఏమీ తినకుండా నడుస్తున్నామని వారు చెప్పారు. ఈ జంట శనివారం నాటికి మీరట్‌లోని షొహ్రాబ్‌ గేట్‌ బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. వీరి దీనస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సానుకూలంగా స్పందించి.. ఆ దంపతులకు స్థానికుల సాయంతో కొంత డబ్బుతో పాటు, వారు బులంద్‌షహర్‌ జిల్లాలోని తమ స్వగ్రామాన్ని చేరటానికి అంబులెన్స్‌ను కూడా ఏర్పాటుచేశారు.

ప్రభుత్వం మంగళవారం నుంచి ఏప్రిల్‌ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) లాక్‌డౌన్‌ వల్ల లక్షలాది వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు. కాగా, పేదల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం అందిస్తామని, ఆహార పదార్థాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆహారం, సదుపాయాల మాటెలా ఉన్నా… మహానగరాల్లో ఉండే కంటే తమ స్వగ్రామాల్లో ఉంటేనే కరోనా నుంచి తప్పించుకోగలమని పలువురు భావిస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు అందుబాటులో లేకున్నా, ఎలాగైనా అక్కడకు చేరాలని నడకదారి పడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా కష్టనష్టాల పాలవుతున్న పేదలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు తెలియచేశారు.