* కరోనా వైరస్ నేపథ్యంలో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించిన నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకులు స్పందించాయి. ఇప్పటికే మారటోరియం అందిస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ప్రకటించగా.. తాజాగా ప్రైవేటు బ్యాంకులు సైతం ముందుకొచ్చాయి. మారటోరియం కావాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయాలని పేర్కొన్నాయి. మారటోరియం వద్దనుకునేవాళ్లు బ్యాంకుకు తెలియజేయాలనే (ఆప్ట్-ఔట్) ఐచ్ఛికాన్ని పీఎస్‌బీలు అందించగా.. కావాలనుకునేవాళ్లు బ్యాంకులను సంప్రదించాలనే (ఆప్ట్-ఇన్) ఐచ్ఛికాన్ని ఇచ్చాయి. మారటోరియం అవసరం లేనివారు బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు సమాచారమిస్తున్నాయి.
* డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక బీమా పాలసీని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో కరోనా కేర్ పేరుతో ఈ బీమాను అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్ 19 బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి వైద్య ఖర్చులకు ఈ బీమా ఆసరాగా ఉంటుందని వెల్లడించింది. దీనికింద ఒకేసారి రూ.156 చెల్లించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 వరకు రక్షణ పొందవచ్చని తెలిపింది. ఆసుపత్రిలో చేరడానికి ముందు, తరవాత మొత్తం 30 రోజుల పాటు వైద్య పరీక్షలు, మందుల కొనుగోలుకు అయ్యే తదితర ఖర్చులను చెల్లించనుంది. ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపు చేయగానే ఈ డిజిటల్ పాలసీ వెంటనే జనరేట్ అవుతుందని తెలిపింది. అయితే ఆ బీమాను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి 15 రోజుల్లోగా కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తేనే ఇది చెల్లుబాటు అవుతుందని, అలాగే 55 సంవత్సరాల లోపు వయసు పరిమితిని విధించింది. ‘ దురదృష్టవశాత్తు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ 19 విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. దీనిపై భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అయితే చాలామంది భారతీయులకు ఆరోగ్య బీమా సదుపాయం లేదు. ఇప్పటికే ఉన్నదానికి కరోనా చికిత్స మరో ఆర్థిక భారం కానుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి దీన్ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాం’ అని ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ వెల్లడించారు. గత నెల డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ డిజిట్ కూడా ఇలాంటి పాలసీనే తీసుకువచ్చింది.
* దేశీయ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం లాభాలతో ఎగిసిన మార్కెట్లు బుధవారం మళ్లీ నేలచూపులు చూశాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 29వేల దిగువకు చేరింది. ట్రేడింగ్ ముగిసేరికి 1,203.18 పాయింట్లు నష్టపోయి 28,265 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 343.95 పాయింట్లు కోల్పోయి 8,253 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.55 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఇంధన, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి.
* మార్చినెలలో దేశీయ ఆటోమొబైల్ రంగంపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగానే పడింది. దీంతో ఈ సారి విక్రయాల గణాంకాల్లో భారీ కోత పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తర్వాత పూర్తి లాక్డౌన్ ప్రకటించడంతో విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం 40శాతం నుంచి 80శాతం వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. గత కొన్నినెలలుగా ఆటోమొబైల్ రంగం కష్టకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జీఎస్టీ వచ్చినప్పుడు, నోట్ల రద్దు సమయంలో కూడా ఈ రంగంపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ సారి మార్చిలో దాదాపు 1,50,000 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు విక్రయించినట్లు అంచనా. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే కేవలం సగం మాత్రమే.