ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారితో అమెరికా అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే దేశంలో అత్యధికంగా 884మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌తో మరణించిన వారిసంఖ్య 5,093కు చేరింది. 2లక్షల 14వేల మంది ఈ వైరస్ బారినపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల సంఖ్య 9లక్షల 30వేలకు చేరగా, మరణాల సంఖ్య 46,809కి చేరింది.
అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న మరణాలు తీవ్రంగా కలచివేస్తోందని అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ అమెరికన్లు ఇలాంటి పరిస్థితిని చూడలేదన్నారు. ఇదేపరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగే అవకాశం ఉందని వైట్‌హౌజ్‌లో మీడియాతో అన్నారు. అయితే ఈ భయంకరమైన వైరస్‌పై పోరు కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. వైరస్ తీవ్రత తగ్గించడానికి లాక్డౌన్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ అమెరికాలో మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని కరోనావైరస్పై శ్వేతసౌధం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అంచనా వేసింది. దీన్ని ఇప్పటికిప్పుడు తగ్గించేందుకు తమవద్ద ఎటువంటి మందూ లేదని తెలిపింది. దీనికి ఏకైక నివారణ వ్యాక్సిన్ అని స్పష్టంచేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తయారీ ప్రాథమిక దశలోనే ఉందని పేర్కొంది. దీనికోసం మరో ఏడాది ఆగాల్సిందేనని శ్వేతసౌధం అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇంతటి భయానక పరిస్థితి ఉన్న అమెరికాలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నిరాకరించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా 30కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ముందస్తు ఆంక్షలు ఏప్రిల్ 30వరకు కొనసాగుతాయని తెలిపారు. మరో 30రోజులపాటు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా వైరస్ తీవ్రత తగ్గించవచ్చని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు.