DailyDose

ఉద్యోగులకు SBI హెచ్చరికలు-వాణిజ్యం

SBI Releases Warnings To Employees-Telugu Business News Roundup Today

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనవ్వడంతో సెన్సెక్స్‌ 674.36 పాయింట్లు నష్టపోయి 27,590.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్లు నష్టపోయి 8,083.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 76.06 వద్ద కొనసాగుతోంది. ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది.

* కరోనా మహమ్మారితో పోరాడుతున్న సంస్థలకు లింక్డ్‌ఇన్‌ తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. క్లిష్ట సమయంలో లాభాపేక్షలేకుండా పనిచేస్తున్న సంస్థలు ఏప్రిల్‌ ఒకటి నుంచి జూన్‌ 30 వరకు తమ ఉద్యోగ ప్రకటనల్ని లింక్డ్ఇన్‌లో ఉచితంగా పోస్ట్ చేసుకునే వెసులుబాటుని కల్పించింది. దీంతో దేశవ్యాప్తంగా కృషిచేస్తున్న హెల్త్‌కేర్‌, సూపర్‌ మార్కెట్లు, గిడ్డంగులు, సరకు రవాణా సంస్థలు ఉద్యోగులను ఉచితంగా నియమించుకునే అవకాశాన్ని కల్పించింది.

* లాక్‌డౌన్‌ నేపథ్యంలో ‘పీఎం గరీబ్‌ కల్యాణ్‌’ ప్యాకేజీ కింద జన్‌ధన్‌ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. అయితే, బ్యాంకుల్లో మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వచ్చే ప్రజలూ సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో కొత్త విధానం అవలంబిస్తున్నారు. జన్‌ధన్‌ ఖాతాలు కలిగిన వారు.. వారి ఖాతాల నంబర్‌ ఆధారంగా ఆయా తేదీల్లో మొత్తాలను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫేస్‌మాస్క్‌ల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా సంస్థ చేసిన ప్రకటనకు శానిటరీ న్యాపికన్లు తయారు చేసే ముంబయికి చెందిన అంకుర సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ అభ్యర్థన మేరకు మెషినరీ మార్పులకు సహకరించడంతో పాటు ముంబయిలోని కాండివలీలోని మహీంద్రా ప్లాంటులో మాస్క్‌ల తయారీకి అవకాశం కల్పించింది. ఆ ప్లాంట్‌ను వర్చువల్‌గా గురువారం ఆనంద్‌ మహీంద్రా ప్రారంభించారు. ఈ విషయాన్ని కంపెనీ ఎండీ పవన్‌ గోయెంకా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘శుక్రవారం నుంచి మాస్క్‌ల తయారీ చేపట్టనున్నాం. 10 రోజుల్లో రోజుకు 10వేల మాస్క్‌ల చొప్పున తయారు చేయనున్నాం. అవి యూవీ స్టెరిలైజ్డ్ మాస్క్‌లు. 99.95శాతం నాణ్యతతో హానికారక క్రిములను అడ్డుకుంటాయి’ అని తెలిపారు. అంతేకాకుండా వాటి తయారీ వీడియోను షేర్ చేశారు.

* కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో కూడా ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కార్యకలాపాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ సొంత ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడాన్ని బ్యాంకు తీవ్రంగా పరిగణించింది. దానికి సంబంధించి ఉద్యోగులను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజూవారీ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్యాంకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని అన్ని స్కరిళ్ల జనరల్‌ మేనేజర్లకు రాసిన లేఖలో పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ హెచ్చరికలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.