దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ చాపకింద నీరులాగ ప్రబలుతూనే ఉంది. ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్‌లో తబ్లిఘీ జమాత్ మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని గుర్తించేందుకు అటు పోలీసులు, ఇటు హెల్త్ టీమ్స్ ఇంటింటీకి తిరుగుతూ విచారణ చేపడుతున్నాయి. ఈ సర్వేలో భాగంగా కింగ్ కోఠి ప్రాంతంలో బయటపడిన ఓ కేసు అధికారులను విస్మయానికి గురి చేసింది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని గుర్తించి, అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. అలాగే వారి కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయాలనుకున్నారు అధికారులు. అయితే ఇక్కడే ఓ విషయం అధికారులను షాకింగ్‌కి గురి చేసింది. కింగ్ కోఠి కరోనా వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో ఏకంగా 46 మంది కుటుంబసభ్యులు ఉంటారు. వారందరిలో ఎంతమందికి వైరస్ సోకిందనే అంశం ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ 46 మందికీ వారి ఇంట్లోనే పరీక్షలు చేస్తున్నారు. అలాగే అందరికీ చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేశామని, ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించామని వైద్యులు తెలిపారు. ఇక వీరందరికీ కరోనా పాజిటివ్ అని తేలితే గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. అంతేకాకుండా.. ఈ 46 మంది వ్యక్తుల ద్వారా.. ఇంకా బయటవారికైనా సోకిందా అనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.
కోఠిలో ఒకే ఇంటిలో 46మంది
Related tags :