DailyDose

ఇండియాలో ఒకే రోజు 505 కేసులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-505 Cases In India In One Day

* దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 505 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ 203 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,577కి చేరింది. ఇప్పటి వరకు 83 మంది మరణించారు. వీరిలో 3,217 మందికి చికిత్స కొనసాగుతోందని, 274 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం కారణంగా కేసుల సంఖ్య వేగంగా పెరిగినట్లు కేంద్రం తెలిపింది.

* ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ ఖాతాదారులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ఖాతాదారులకు పుట్టిన తేదీ మార్పు కోసం ఆధార్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కార్మిక శాఖ అన్ని పీఎఫ్‌ కార్యాలయాలకు సూచనలు జారీ చేసింది. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు తమ ఈపీఎఫ్‌ రికార్డుల్లో పుట్టిన తేదీని మార్చుకునే వీలు కలుగుతుంది. పీఎఫ్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఈ మేరకు సవరణ అభ్యర్థనలు పెట్టుకోవచ్చు. అయితే, పుట్టిన తేదీ విషయంలో మూడేళ్ల వరకు వ్యత్యాసాన్ని మాత్రమే అనుమతిస్తారు.

Coronavirus Latest Updates in India State Wise | Coronavirus live ...

* ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 252 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో తాజాగా ఈరోజే మరో 26 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 53కి చేరింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదైన కొవిడ్‌-19 పరీక్షల్లో తాజా కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* చావు కూడా ఈ జంటను వేరు చేయలేకపోయింది. 51 ఏళ్ల వైవాహిక జీవితంలో కష్టసుఖాల్ని పంచుకున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా అనురాగాన్ని నింపుకున్నారు. చివరికి ఒకేసారి ఈ లోకాన్ని విడిచారు. ఫ్లోరిడాకు చెందిన దంపతుల కథ ఇది. స్టువర్ట్ బేకర్ (74), అడ్రియన్ బేకర్ (72) 51 ఏళ్ల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ ఇద్దరు గత వారం మృతి చెందారు. ఆరు నిమిషాల తేడాతో ఇద్దరు మరణించారు. అయితే చావు కూడా తన తల్లిదండ్రుల్ని వేరు చేయలేకపోయిందని వారి కుమారుడు బడ్డీ బేకర్‌ అన్నాడు.

* కరోనాపై పోరులో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14ను ముగియనుండడంతో విద్యాసంస్థలు తెరిచే విషయమై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని కేంద్ర మానవవనరులశాఖమంత్రి రమేష్‌ పొక్రియాల్‌ నిషాంక్‌ శనివారం అన్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ పొడిగించే పరిస్థితులు ఉంటే విద్యాసంవత్సరానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతపరిస్థితుల్లో విద్యాసంస్థల తెరిచే విషయంలో నిర్ణయాన్ని వేగంగా తీసుకోలేమని, అది ఏప్రిల్‌ 14 తర్వాత దేశంలో ఉండే పరిస్థితుల తీవ్రతపై ఆధారపడిఉంటుదన్నారు.

* 21వ శతాబ్దంలో ఈ ఏడాది ఎంతో నిరాశపరుస్తోంది. బుష్‌ఫైర్‌తో ఆస్ట్రేలియా నష్టపోగా‌, కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచమంతా విలవిలలాడుతోంది. ప్రకృతి విపత్తులతో అందరూ అల్లాడిపోతున్నారు. అయితే ఏప్రిల్‌ 7న రాత్రి 8.30 సమయంలో చంద్రుడిలో భారీ మార్పులు కనిపించనున్నాయి. పౌర్ణమి రోజు సాధారణంగా కనిపించే దాని కంటే ఆకారంలో 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమివ్వనున్నాడు. దీన్ని పింక్‌ సూపర్‌ మూన్‌గా అభివర్ణిస్తారు. ఈ ఏడాదిలో చంద్రుడు పెద్దగా కనిపించే రోజు ఇదే.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయంగా ఇప్పటివరకు 12,16,422 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 2,52,478 మంది కోలుకున్నారు. సుమారు 65,711 మంది కన్నుమూశారు. వైద్యం తీసుకుంటున్నవారు 8,98,233గా ఉన్నారు. ఇక మన దేశం పరిస్థితి చూస్తే… కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా భారత్‌లో 3,577 కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు దిగువ గ్రాఫ్స్‌లో.!

* కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా విమానసర్వీసులను రద్దు చేశారు. అయితే విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఎయిర్‌ఇండియా ఐరోపా దేశాలకు ఆదివారం ముంబయి నుంచి రెండు ప్రత్యేక విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ముంబయి నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరిన విమానం పాక్‌కు చెందిన విమాన సమాచార ప్రాంతం(ఎఫ్‌ఐఆర్‌)లోకి చేరగానే ‘‘నమస్కారం’’ ఫ్రాంక్‌ఫర్ట్‌కు విమానసర్వీసు నడుపుతున్న ఎయిర్‌ఇండియాకు స్వాగతం అని పాక్‌ విమానయాన అధికారులు అన్నట్టుగా ఎయిర్‌ఇండియా పైలట్‌ తెలిపారు.

* బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియా భట్‌కు రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అంటే చాలా ఇష్టమట. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్‌ చరణ్‌కు జోడీగా కనిపించనున్నారు. తారక్‌ మరో కథానాయకుడు. ఆయన ప్రియురాలిగా ఒలీవియా మోరిస్‌ నటిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 8న సినిమా విడుదల కాబోతోంది.