కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాతో భారత్ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే ఆయన(మోదీ) నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివారం ఆయనతో మాట్లాడాను. క్లోరోక్విన్ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?’’ అని సోమవారం శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఔషధ రంగంలో అమెరికాకు భారత్ సుదీర్ఘకాలం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్ జీ వెల్స్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు 3,67,461 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 10,910 మంది మృతిచెందారు.
కరోనా పరిస్థితులపై ఇరుదేశాధినేతలు ఆదివారం ఫోన్‌లో చర్చించిన విషయం తెలిసిందే. కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని తమకు సరఫరా చేయాలని ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ను కోరారు. అయితే, ఈ ఔషధం సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్ నిషేధం విధించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు టీకా, ఔషధం లేకపోవడంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పై ట్రంప్ ఆశలు పెట్టుకున్నారు. ఈ ఔషధాన్ని మలేరియాకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొవిడ్-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. దీంతో అమెరికా ఇప్పటికే 29 మిలియన్ డోసుల మేర హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను నిల్వ చేసి పెట్టుకుందని స్వయంగా ట్రంపే వెల్లడించారు. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.
హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.