DailyDose

5వేలు దాటిన భారతీయ కరోనా బాధితులు-TNI కథనాలు

Indian COVID19 Patients Cross 5000-TNILIVE Special Health Bulletin

*తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 49 కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో 11 మంది మృతిచెందగా.. 45 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 397 మంది చికిత్స పొందుతున్నారని ఈటల చెప్పారు.

* తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా మరో 48 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 738కి చేరింది. 8మంది ఇప్పటి వరకు ఈ మహమ్మారితో చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

* గుంటూరు జిల్లాలో కొత్తగా మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 49కి చేరినట్లు జిల్లా వైద్యారోగ్య అధికారి యాస్మిన్‌ వెల్లడించారు. కొత్తగా నమోదైన 8 కేసులూ గుంటూరు నగరంలోనివేనని తెలిపారు. ఆనందపేటలో నలుగురికి, కుమ్మరి బజారు 2, యానాదిపేట, కొరిటపాడు ప్రాంతాల్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌ తేలినట్లు చెప్పారు. జిల్లాకు సంబంధించి ఇంకా 135 నివేదికలు రావాల్సి ఉందన్నారు.

* కొవిడ్‌-19 దృష్ట్యా వ్యక్తిగత, వ్యాపార వర్గాలకు ఉపశమనం కల్పించేలా ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రిఫండ్‌లను తక్షణమే విడుదల చేయాలని నిర్ణయించింది. ఐదు లక్షల రూపాయలలోపు ఉన్న 14 లక్షల మందికి ఈ నిర్ణయంతో ఉపశమనం లభించనుంది. జీఎస్టీ, కస్టమ్స్‌ విభాగాలకు చెందిన దాదాపు మరో లక్ష మంది వ్యాపారులకూ లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ.18 వేల కోట్లు రిఫండ్‌ కింద విడుదల చేయనున్నట్లు ఐటీ శాఖ ప్రకటించింది.

* భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు 5274 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వీరిలో 411 మంది కోలుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రోజు సాయంత్రం 5గంటల సమయం వరకు నమోదైన వివరాలను ప్రకటించింది. భారత్‌లో ఇప్పటివరకు కొవిడ్‌ -19 బారిన పడి 149 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.

* పార్లమెంట్‌లో అఖిలపక్ష పార్టీల ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 80శాతం కంటే పైగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని సూచించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ప్రజలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరుతున్నట్టు తనకు సమాచారం వస్తోందని ప్రధాని చెప్పారనీ.. కానీ ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం తుది నిర్ణయం ఉంటుందన్నారని ఆజాద్‌ తెలిపారు.