Business

ఈడీ సమన్లు అందుకున్న కొచ్చర్ దంపతులు

the kochchars receive summons from enforcement directorate towards videocon scam investigation

ఐసీఐసీఐ బ్యాంకు-వీడియోకాన్‌ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మే 3న చందా కొచ్చర్‌, ఏప్రిల్‌ 30న దీపక్‌ కొచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లు విచారణాధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అంతేకాకుండా వారి వ్యక్తిగత, వృత్తి పరమైన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు తీసుకురావాల్సిందిగా వారికి తెలియజేసినట్లు ఈ కేసు విచారణతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్‌ గ్రూప్‌కి చెందిన వేణుగోపాల్ ధూత్‌ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో వారిని విచారించిన విషయం తెలిసిందే. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్‌ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. చందా కొచ్చర్‌ భర్తకు చెందిన కంపెనీలో వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్‌ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నెలల తర్వాత వీడియోకాన్‌కు రుణం మంజూరైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.