అమెరికాలో ఒక్కరోజే 2వేల మంది బలి!
దేశవ్యాప్తంగా 14,695మంది మృత్యువాత
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 1973మరణాలు సంభవించాయి. అంతకుముందు రోజు కూడా 1939మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్-19 బారినపడి మరణించినవారి సంఖ్య 14,695కి చేరింది. అమెరికాలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4,35,128కి చేరింది. దీంతో ప్రపంచంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. ఇక్కడ కరోనా మరణాల సంఖ్య స్పెయిన్‌ను దాటేసింది. కరోనా కాటుకు స్పెయిన్‌లో ఇప్పటివరకు 14,673మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య లక్షా 48వేలు దాటింది. ఇక ప్రపంచంలో కొవిడ్-19 మరణాలు అత్యధికంగా ఇటలీలో చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఇటలీలో 17,669మంది మరణించారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
11మంది భారతీయులు మృతి..
కరోనా కారణంగా అమెరికాలో భారతీయులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి 11మంది భారతీయులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరో 16మందికి కరోనా నిర్ధారణ కాగా ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకిన భారతీయుల్లో న్యూయార్క్, న్యూజెర్సీకి చెందినవారే ఉన్నారు. అమెరికాలో అత్యధిక కేసులు న్యూయార్క్‌లోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరువేలు దాటగా బాధితుల సంఖ్య లక్షా నలభైవేలకు చేరింది. న్యూజెర్సీలోనూ ఈ వైరస్ సోకి 1500మంది మరణించారు.