* ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించింది. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.500ను ఇప్పటికే జమచేశామని వెల్లడించింది. మిగిలిన వెయ్యి రూపాయలను రూ.500 చొప్పున తర్వాతి రెండు నెలల్లో జమచేస్తామని స్పష్టం చేసింది.
* లాక్‌డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు గానూ టర్మ్ రుణాలపై మారటోరియం ఇవ్వాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆ సౌకర్యం కల్పించాయి. ఈ నేపథ్యంలో సైబర్‌నేరగాళ్లు కొత్త పంథాకు తెరలేపారు. మారటోరియం పేరుతో వ్యక్తిగత వివరాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులకు సందేశాలు పంపించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. ఓటీపీ, పిన్ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నాయి.
* తమ వద్ద రిటైల్ (గృహ, వాహన, తనఖా) రుణాలు తీసుకుని, క్రెడిట్‌స్కోర్ 650 పైన ఉన్న ఖాతాదార్లకు, రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. అయిదేళ్ల కాలావధికి ఇచ్చే ఈ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వెల్లడించింది. గృహరుణంలో 10 శాతం, వాహన రుణంలో 20 శాతాన్ని ఇలా మంజూరు చేస్తామని వివరించింది.కరోనా వైరస్ లాక్‌డౌన్ వల్ల నగదు లభ్యత ఏర్పడటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
* దేశ వ్యాప్తంగా మొత్తం 500 విక్రయ కేంద్రాలను ఆన్‌లైన్ విక్రయాల ప్లాట్‌ఫామ్ ‘క్లిక్ టు బై’కు అనుసంధానించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటైల్ ఖాతాదారులకు సేవలు అందించనున్నట్లు తెలిపింది. దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని కొంత మంది డీలర్ల పరిధిలో ఈ ఏడాది జనవరిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. న్యూ క్రెటా, వెర్నాతో పాటు అన్ని హ్యుందాయ్ మోడళ్లను క్లిక్ టు బై వెబ్‌సైట్ ద్వారా ఖాతాదారులు కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ‘వినియోగదారులకు ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. డెలివరీ ఆప్షన్ కూడా వినియోగదారు ఇష్టమ’ని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌ఎస్ కిమ్ వెల్లడించారు.
* దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌తో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. 130కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ మూగబోయింది. దీంతో భారీగా చమురు వినియోగించే దేశంలో ఒక్కసారిగా వీటి డిమాండ్ పతనమయ్యింది. దీంతో చమురుశుద్ధి సంస్థలతోపాటు ఉత్పత్తి సంస్థలపై కూడా దీని ప్రభావం భారీగా పడింది. లాక్‌డౌన్ కాలంలో దాదాపు 70శాతం డిమాండ్ కోల్పోయినట్లు చమురుసంస్థలు అంచనా వేస్తున్నాయి.