Sports

సోది చెప్తున్న సర్ఫరాజ్

sarfaraaz claims pakistan is most favorite than india

2019 ప్రపంచకప్‌లో భారత్‌ కంటే పాకిస్థాన్‌ జట్టే ఫేవరెట్‌ అని ఆ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నాడు. ఈసారి ప్రపంచకప్‌ గెలిచే జట్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఇంగ్లాండ్‌, ఇండియా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పాకిస్థాన్‌ కెప్టెన్‌ మాత్రం మా జట్టుకే ప్రపంచకప్‌ గెలిచే అవకాశాలున్నాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌పై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు కాబట్టి జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నాడు. ఒకవేళ భారీ అంచనాలతో టోర్నీకి వెళ్తే తీవ్ర ఒత్తిడి భరించాల్సి ఉంటుంది. అది జట్టులో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపిస్తుందన్నాడు. అందుకే ఎటువంటి అంచనాలు లేకుండా టోర్నీలో పాల్గొంటున్న పాకిస్థాన్‌కే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకూ ఏ ప్రపంచకప్‌లోనూ భారత్‌పై పాకిస్థాన్‌ విజయం సాధించలేదు. అయితే, ఈ సారి ఇండియాతో జరిగే మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నాడు. టోర్నీలో ఆడే 9 మ్యాచులు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతి మ్యాచ్‌ ఇండియాతో ఆడినట్లే భావిస్తామని పాకిస్థాన్‌ కెప్టెన్‌ అన్నాడు. గతంలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ను ఓడించడం మా జట్టుకు కలిసొచ్చే అంశమని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు.