Business

IMF జట్టులోకి రాజన్

Telugu Business News-Rajan Joins IMF Advisory Team

ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్ (57) కీలక గౌరవాన్ని దక్కించుకున్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత దేశంలో అనుసరించాల్సిన ఆర్థికవిధానాలపై పలు కీలకసూచనలు చేసిన ఆయన తాజాగా అంతర్జాతీయ ద్యవ్యనిథి సంస్థ (ఐఎంఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటైన సలహా బృందంలో చోటు దక్కించుకన్నారు.12మంది ఆర్థిక నిపుణులతో ఏర్పాటైన ఈ కమిటీలో రఘురామ్ రాజన్‌ను కూడా చేరుస్తూ ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఒక ప్రకటన జారీ చేశారు. గ్లోబల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్పన్నమైన అసాధారణ సవాళ్లు, పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా దృక్పథాలను అందిస్తుందని ఐఎంఎఫ్ శుక్రవారం తెలిపింది.

ఆర్థికమాంద్యంతో ఇబ్బందులు పడుతున్న తమ సభ్యదేశాలను ఆదుకునేందుకు, ఆర్థిక సహాయం, సంబంధిత విధానాల రూపకల్పనలో అసాధారణమైన నైపుణ్యం, అగ్రశ్రేణి నిపుణుల సలహాలు తమకిపుడు చాలా అవసరం ఆమె చెప్పారు. వీరంతా తమ అమూల్య సేవలను అందించేందుకు అంగీకరించడం తనకు గర్వంగా ఉందన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అసాధారణ సవాళ్లు, కీలక పరిణామాలు, ఇతర విధి విధానాలపై ఈ టీం సూచనలు చేయనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి ,సింగపూర్ ద్రవ్య అథారిటీ చైర్మన్ షణ్ముగరత్నం, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ క్రిస్టిన్ ఫోర్బ్స్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, యుఎన్ మాజీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లార్డ్ మార్క్ మల్లోచ్ బ్రౌన్ తదితరులు కమిటీలో వున్నారు.

కాగా కోవిడ్-19 మహమ్మారి గడచిన శతాబ్దంలో ఎదురైన సంక్షోభాలన్నికంటే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామంటూ ఇప్పటికే క్రిస్టలినా ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర మందగనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మహమ్మారి మరింత దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఐఎంఎఫ్ సభ్య దేశాల్లోని సుమారు 170 దేశాల్లో తలసరి ఆదాయం క్షీణించిందని పేర్కొన్నారు. 2016 సెప్టెంబర్ వరకు మూడేళ్లపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా పనిచేసిన రాజన్ ప్రస్తుతం అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.