Health

మధుమేహులకు ఆకు చికిత్స

Leaves Treatment For Diabetic Patients-Telugu Health News

మధుమేహ రోగులకి చిన్నదెబ్బకే ఎముకలు విరిగిపోవడమే కాదు, దెబ్బ తగిలితే కూడా చాలా నెమ్మదిగా తగ్గుతుంది. అందుకే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఎముక నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్‌ను ఆహారం లేదా మాత్రల ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే- డయాబెటిస్‌ బాధితుల్లో ఇన్సులిన్‌ లోపం కారణంగానే రక్తంలో గ్లూకోజ్‌ పేరుకు పోతుందని తెలిసిందే. అదే ఇన్సులిన్‌ ఎముకల పునర్నిర్మాణానికీ తోడ్పడుతుంది. అందుకే వాళ్లలో ఎముకలు విరిగితే ఆ ప్రొటీన్‌ను ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వాలి. కానీ ఇన్సులిన్‌ ధర ఎక్కువ ఉండటంతోబాటు దాన్ని నిల్వ చేయడం, సరఫరా చేయడం కూడా కష్టం. అందుకే శాస్త్రబృందం నోటి ద్వారా ఇచ్చే మందుమీద దృష్టిని కేంద్రీకరించింది. ఇందుకోసం ఇన్సులిన్‌లా పనిచేసే ఐజిఎఫ్‌-1 అనే ప్రొటీన్‌ను రూపొందించింది. అంతేకాదు, కండరాలూ, ఎముకల పునర్నిర్మాణానికి తోడ్పడే ఈ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువును లెట్యూస్‌ మొక్కల్లో ప్రవేశపెట్టగా- దాని ఆకుల్లో ఈ ప్రొటీన్‌ సమృద్ధిగా కనిపించిదట. ఆ తరవాత వాటిని ఎండబెట్టి పొడిచేసి మందుని తయారుచేసి డయాబెటిస్‌ బారిన పడ్డ ఎలుకల్లో ప్రయోగించినప్పుడు- వాటిల్లో ఎముకల సాంద్రత పెరిగినట్లు గుర్తించారు. కాబట్టి త్వరలోనే ఈ ప్రొటీన్‌తో కూడిన లెట్యూస్‌ని వాడుకలోకి తీసుకొస్తే మధుమేహులతోబాటు ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవాళ్లందరికీ ఉపశమనం ఉంటుంది అంటున్నారు.