DailyDose

420 మంది భారతీయులు మృతి-TNI కథనాలు

420 మంది భారతీయులు మృతి-TNI కథనాలు

* తెలంగాణలో కొత్తగా మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. వీటిలో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే వచ్చాయన్నారు. ఈ రోజు ఎవరూ చనిపోలేదన్నారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా నుంచి కోలుకున్న 68మందిని డిశ్చార్జి చేస్తున్నాం. 14 రోజులు గడిచిన తర్వాత నిన్న తొలి టెస్ట్‌లో నెగిటివ్‌ వచ్చింది. ఈ రోజు పరీక్షల్లో కూడా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ఈ రోజు డిశ్చార్జి చేసేందుకు ఈ రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదు. ముగ్గురు వెంటిలేటర్‌పై ఉన్నారు’’ అని వివరించారు.

* దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబయిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 107 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ముగ్గురు మృత్యువాత పడ్డారని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2043కు చేరింది. ఇప్పటి వరకు 116 మంది మృత్యువాత పడ్డారు.

* కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలి ఆస్పత్రిని 1500 పడకల స్థాయికి తీర్చిదిద్దినట్టు తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 20న ఈ ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘10లక్షల పీపీఈ కిట్లు, 10లక్షల ఎన్‌95 మాస్కులు, ఆస్పత్రుల్లో గాగుల్స్‌, వైద్య పరికరాలు సమకూర్చుకుంటున్నాం. వైద్య సిబ్బందితో పాటు రక్షణ సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేస్తున్నాం’’ అని వివరించారు.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు (సాయంత్రం 5గంటల సమయానికి) 12,759 కేసులు నమోదు కాగా.. వారిలో 1515 మంది కోలుకున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 420కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

* రాష్ట్రంలో 16వేల మందికి పైగా కరోనా వైద్య పరీక్షలు చేసినట్టు ఏపీ వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు. ప్రతి రోజూ 2వేల నమూనాలు పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ 3వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వారం తర్వాత రోజుకు 17వేల మందికి పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. లక్ష ట్రూనాట్‌ కిట్లకు ఆర్డర్‌ ఇచ్చామనీ.. ఈ నెల 20 నాటికి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లు వెల్లడిస్తామని జవహర్‌ రెడ్డి తెలిపారు.