DailyDose

ఐటీ ఉద్యోగుల జోలికి వెళ్లొద్దు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-KTR Requests Not To Fire Employees

* ఐటీ సంస్థలు మరియు తెలంగాణలో ఉన్న పరిశ్రమలు, తమ కంపెనీల నుండి ఉద్యోగస్తులను తొలిగించవద్దని సంస్థల యాజమాన్యాలకు లేఖ రాసిన మంత్రి కేటీఆర్.

* పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని ప్రభుత్వ వైన్ షాపులో చోరీ జరిగింది. షాపు తాళాలను పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు మందు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. 2 లక్షల 11 వేల రూపాయలు మద్యం బాటిళ్లను అపహరించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

* వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) కి ఇంతవరకూ సరైన చికిత్స లేదు. దీన్ని అదుపు చేసే మందునూ ఇంతవరకు ఆవిష్కరించలేదు. అదే సమయంలో వ్యాక్సిన్‌ను తయారుచేసే యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఇతర వ్యాధులకు చికిత్సలో వినియోగించే కొన్ని ఔషధాలు కొవిడ్‌-19 బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నట్లు తేలింది. దీంతో ఆ ఔషధాలకు ఒక్కసారిగా గిరాకీ ఏర్పడింది. అందులో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణలో వినియోగించే మందులు, మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు వినియోగించే క్లోరోక్విన్‌, యాంటీ-బయాటిక్‌ ఔషధాలు ఉన్నాయి. ఈ ఔషధాలను తయారు చేసే ఫార్మా కంపెనీలు మనదేశంలోనే అధికంగా ఉన్నాయి. వాస్తవానికి ఔషధ పరిశ్రమ మనదేశంలో గత రెండు మూడు దశాబ్దాల్లో బహుముఖంగా విస్తరించింది. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కొన్ని ఆసియా దేశాలు మనదేశం నుంచి మందులను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. దీనికి తోడు కొవిడ్‌-19 వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగిస్తున్న హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, మలేరియా మందుల తయారీ కూడా మనదేశంలోనే అధికంగా ఉంది. దీంతో ఈ ఔషధాలను సరఫరా చేయాల్సిందిగా అమెరికా నుంచి బ్రెజిల్‌, ఇజ్రాయెల్‌ తదితర ఎన్నో దేశాలు మనదేశంపై ఒత్తిడి తెస్తున్నాయి. అదే సమయంలో దేశీయ అవసరాలకు మందులు సరఫరా చేయాల్సిన బాధ్యత ఎటూ ఉండనే ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున ఈ ఔషధాల తయారీని చేపట్టాయి. కానీ ఇక్కడే సమస్య ఉంది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఈ ఔషధాలు తయారు చేయటానికి ఫార్మా కంపెనీలకు ముడిపదార్థాల కొరత ఎదురవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల వద్ద ఉన్న ముడిసరకు నిల్వలు దాదాపుగా అయిపోయాయి. కొత్తగా ముడిపదార్థాలు అందితే గానీ మందులు తయారు చేయటం సాధ్యం కాని పరిస్థితి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ‘క్లోరోక్విన్‌’ తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరతను స్థానిక ఫార్మా కంపెనీలు ఎదుర్కొంటున్నాయి.

* కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘తీవ్ర ఆర్థిక మాంద్యం’ ఎదుర్కోబోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. కరోనాకు పూర్వం మందగమనంలో ఉన్న ప్రపంచ ఆర్థికం 2020లో తీవ్ర సంక్షోభం చవిచూడబోతోందని పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పాలకులకు ఇది అతిపెద్ద సవాలు కానుందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా పేర్కొన్నారు. ఈ మేరకు ఐఎంఎఫ్‌ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రపంచ ఆర్థికంలో పెద్దఎత్తున కోత తప్పదని హెచ్చరించారు.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌.. బ్రిటన్‌లో పసిద్ధి చెందిన స్పోర్టింగ్‌ మోటార్‌సైకిళ్ల కంపెనీ నార్టన్‌ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.153 కోట్లు అని టీవీఎస్‌ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్రిటన్‌లోని నార్టన్‌కు చెందిన ఆస్తుల్ని, బ్రాండ్లను అక్కడి టీవీఎస్‌ అనుబంధ సంస్థ స్వాధీనం చేసుకోనుంది. నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను 1898లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేమ్స్‌ లాన్స్‌డౌన్‌ నార్టన్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. ఈ కంపెనీ క్లాసిక్‌ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి బాగా ప్రసిద్ధి పొందింది. నార్టన్‌కు చెందిన వీ4, డామినేటర్‌, కమాండో 961 కేఫ్‌ రేసర్‌ ఎంకే-2, కమాండో 961 స్పోర్ట్‌ ఎంకే-2లు మోడళ్లు బాగా ప్రసిద్ధిపొందాయి.

* ఈ ఏడాది (2020) మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 6.8 శాతం క్షీణించింది. 1976లో వచ్చిన సాంస్కృతిక విప్లవం తర్వాత చైనా వృద్ధి ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తీసుకున్న చర్యలతో చైనా ఆర్థిక వ్యవస్థ ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) ప్రకారం.. 2020 మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్‌ యువాన్లు (దాదాపు 2.91 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 6.8 శాతం తక్కువ. మొదటి రెండు నెలల్లో 20.5 శాతం తగ్గిన వృద్ధి.. మార్చిలో పుంజుకుందని ఎన్‌బీఎస్‌ తెలిపింది. 2019లో చైనా వృద్ధి 6.1 శాతంగా నమోదైంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వల్ల 29 ఏళ్లలోనే అత్యల్ప వృద్ధి రేటును చైనా నమోదు చేసింది. 2018లో 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న జీడీపీ.. 2019లో 14.38 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అయితే గత డిసెంబరులో వూహాన్‌లో కరోనా వైరస్‌ వెలుగులోకి రావడంతో.. చైనా ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. రెండు నెలలకు పైగా హుబే ప్రావిన్స్‌, వూహాన్‌లు లాక్‌డౌన్‌లోనే ఉండిపోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడిప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

* అంతర్జాతీయ కాల్‌ రద్దు ఛార్జీలను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ పెంచింది. ఇంతకు ముందు నిమిషానికి 30 పైసలు ఫిక్స్‌డ్‌ రేటు ఉండగా.. తాజాగా దాన్ని నిమిషానికి 35-65 పైసల మేర అధికం చేసింది. ట్రాయ్‌ నిర్ణయం టెలికాం ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చనుంది. అంతర్జాతీయ కాల్‌ రద్దు ఛార్జీలను ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టన్స్‌ ఆపరేటర్‌ (ఐఎల్‌డీఓ) భరిస్తాడు. దేశం నుంచి వెళ్లే కాల్స్‌ను.. ఇతర దేశాల ప్రొవైడర్లకు ఐఎల్‌డీఏ చేరవేస్తాడు. తాజాగా రద్దు ఛార్జీల కనీసం, గరిష్ఠ ధరల శ్రేణిని ట్రాయ్‌ నిర్ణయించింది. ఇక ఈ శ్రేణిలో కాల్‌ రద్దు ఛార్జీలను ఆపరేటర్లు నిర్ణయించవచ్చు. కొత్త అంతర్జాతీయ కాల్‌ రద్దు ఛార్జీల అమలును సునిశితంగా పర్యవేక్షిస్తామని ట్రాయ్‌ స్పష్టం చేసింది.

* ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతరదేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. భారత్‌తో సరిహద్దులు పంచుకొనే దేశాలు, అక్కడి వ్యక్తులు, వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

* ఈ ఏడాది ఉద్యోగులకు రూ.250 కోట్ల ఉద్యోగుల స్టాక్‌ యాజమాన్య ప్రణాళిక (ఈసాప్స్‌) అందించనున్నట్లు డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎం ప్రకటించింది. వచ్చే 3-4 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేస్తామని, మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులతో పాటు కొత్తవాళ్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. అయితే ఎంత మంది ఉద్యోగులకు ఈసాప్స్‌ అందిస్తున్నార్న వివరాలను వెల్లడించలేదు. ఈ ఏడాది జనవరిలో వార్షిక పనితీరు సమీక్షలను కంపెనీ ప్రారంభించింది. ఇక ఆర్థిక సేవల విస్తరణకు 500కు పైగా నియామకాలు చేపట్టనున్నట్లు పేటీఎం వెల్లడించింది. ఇక పనితీరు బాగాలేని ఉద్యోగులకు రెండు నెలల పొడిగింపు ఇవ్వనున్నట్లు తెలిపింది.