నిర్మాత కావడానికి డబ్బు ఒక్కటే క్వాలిఫికేషన్ కాదు. అలా అనుకుంటే… టాటా, బిర్లాలు సునాయాసంగా సినిమాలు తీసి పారేసేవారు. నిర్మాత కావాలనుకునే వారికి రామానాయుడి మేకింగ్ స్టయిల్ ఓ పాఠ్యగ్రంథం. కొత్త నిర్మాతలు, పండంటి సినిమాలు తీయాలనుకొనేవారి కోసం ఆయన చెప్పిన 12 మార్గదర్శక సూత్రాలివి.
1 సినిమా ఫీల్డ్‌లో ఇన్నేళ్లు ఉండగలిగానంటే ఎన్టీఆర్, దర్శకుడు గుత్తా రామినీడు, ‘విజయా’ సంస్థ అధినేత బి. నాగిరెడ్డి తదితర మహానుభావుల నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ, నిర్మాణ పద్ధతు లు కారణం. నిర్మాణంలో ప్లానింగ్, ఫుల్ స్క్రిప్ట్‌తోనే షూటింగ్‌కు వెళ్లడం, టైమ్ సెన్స్ అన్నవి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నా. ఎక్కడెలా ఉండాలో రామినీడు చెప్పారు. నాగిరెడ్డి గారు నాకు గైడ్.
2.విత్తు లేనిదే చెట్టు ఎలా లేదో, కథ లేనిదే సినిమా లేదు. పూర్తి స్క్రిప్టు లేనిదే నేనెప్పుడూ సినిమా మొదలు పెట్టలేదు. స్టోరీ లైన్ చెబుతామని నా దగ్గరకు చాలా మంది రచయితలు వస్తుంటారు. నేను ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ అడుగుతాను. ఓపెనింగ్ షాట్ దగ్గర్నుంచీ, శుభం షాట్ వరకు అన్ని సీన్ల గురించి నేను డీటైల్డ్‌గా తెలుసుకుంటాను. ఒక కామెడీ ట్రాక్ నచ్చిందనో, లేక ఒక యాక్షన్ ఎపిసోడ్ బాగుందనో సినిమా మొదలు పెట్టేయడం మంచి పద్ధతి కాదు. ఫుల్‌స్క్రిప్ట్ ఉంటేనే బడ్జెట్, లొకేషన్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోగలం. విజయానికి నా దగ్గర ఫార్ములాలు, ఈక్వేషన్లు ఏమీ లేవు. కథే కీ ఫ్యాక్టర్. ఆ కథలో బేసిక్ యాక్సెప్టెన్స్ ఉండాలి! వాటికి తోడు అంకిత భావం! ఇవి లేకుండా విజయాల గురించి ఆలోచనే అనవసరం. ఇక ఎలాంటి కథ అనేది వారి, వారి అభిరుచుల్ని బట్టి ఉంటుంది.
3. కథను బట్టే పాత్రల ఎంపిక జరగాలి. ఆర్టిస్టుల కాల్షీట్ల విషయంలోనూ, పారితోషికాల విషయం లోనూ పక్కాగా ఉండాలి. ఏదైనా ముందే రాతపూర్వక ఒప్పందం చేసుకోవడం మంచిది. ఎన్ని రోజుల్లో సినిమా తీస్తామన్నది కూడా ముందే తెలిస్తే, ఆర్టిస్టుల కాల్షీట్ల ఏర్పాటు సులువవుతుంది.
4. నేను ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టే సమయానికి నాకు బడ్జెట్లు, షెడ్యూళ్లు, కాల్షీట్లు ఇవేమీ తెలీవు. అన్నీ నేర్చుకున్నాను. ఏ సినిమా అయినా సరే… ఏ రోజు, ఎక్కడ, ఏం చెయ్యాలన్నది చాలా స్పష్టంగా నా ఫైల్లో ఉండాల్సిందే. ఒక్కసారి కథ ఫైనల్ అయ్యాక మళ్లీ మార్పులుండవు. సంభాషణలు, లొకేషన్స్, చివరకు హీరోయిన్ కట్టుకునే చీర కానివ్వండి. దాన్నిబట్టే మిగతా ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ తారు మారు కావడం వల్లే బడ్జెట్ మారిపోతుంది. అవన్నీ సినిమా సక్సెస్ మీద ప్రభావం చూపిస్తాయి.
5.సినిమా ముమ్మాటికీ వ్యాపారమే. అయితే కల్తీ లేకుండా, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, మన అభిరుచుల్ని నిలుపుకుంటూ ముందుకు సాగాలి. ప్రొడక్షన్ వ్యవహారాలెలా జరుగుతున్నాయో, ఎక్కడ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి. అన్ని శాఖల గురించి కనీసం తెలిసి ఉండాలి.
6. నిర్మాత తప్పనిసరిగా లొకేషన్లో ఉండాలి. మనిషి ఎదురుగా ఉన్నదానికి, లేనిదానికి చాలా తేడా ఉంటుంది. నిర్మాత లొకేషన్లో ఉండడం వల్ల నిర్మాణ వ్యయంలో 30 శాతం వృథాను తగ్గించొచ్చు.
7. డెయిలీ రిపోర్ట్ నిర్మాతకు తెలియాలి. ఎంత మంది జూనియర్ ఆర్టిస్టులొచ్చారు? కార్లెన్ని పెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలి. చెక్‌ల మీద సంతకాలు పెట్టడమే నిర్మాత పని కాదు. తగిన నిఘా అవసరం.
8.జయాపజయాలు సాధారణం. అపజయమొస్తే ధైర్యంగా ఉండాలి. జయమొస్తే ఒళ్లు దగ్గరెట్టుకోవాలి.
9. ప్రధానంగా పారితోషికాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇన్నేళ్లల్లో నా సంస్థలో చెక్ బౌన్స్ అయిందన్న మాటే వినపడలేదు. నా దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేసైనా అందరికీ చెల్లించేసేవాణ్ణి. వాళ్ల పనులు పూర్తయ్యే లోపు అందరి చేతుల్లోనూ చెక్‌లు ఉంచడం నా పద్ధతి.
10 .వ్యక్తిగత ఆసక్తులను వ్యాపారంతో కలపకూడదు. దేని దారి దానిదే అన్నట్టు చూస్తేనే వృత్తి సక్రమంగా సాగుతుంది. ఎక్కువ ఆబ్లిగేషన్స్ పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. ‘ఎక్కడైనా బావ గానీ వంగతోట కాడ కాదు…’ అనే సామెత నూటికి నూరుపాళ్లు ఈ వ్యాపారానికి వర్తిస్తుంది. నా దృష్టిలో ఇల్లు దేవాలయం, భార్య దేవత. ఈ సినీ ఫీల్డ్‌లో చిన్న చిన్న గ్లామర్ తప్పులు జరుగుతుంటాయి. తప్పు చేస్తే వాష్ యువర్ హ్యాండ్, కమ్ ఔట్ ఆఫ్ ఇట్… దాన్నే పట్టుకు వేళ్లాడకూడదు.
11 స్నేహాన్ని వ్యాపారంతో ముడిపెట్టకూడదు, గ్యారంటీ సంతకాలు పెట్టకూడదన్నది నేను నేర్చుకున్న జీవితపాఠం. నా జీవితం, సినిమా అన్నీ ప్లానింగ్‌తోనే ముడిపడి ఉంటాయి. అదే నా విజయ రహస్యం.
12. మా పెదనాన్న కుప్పుస్వామి దగ్గర్నుంచి నేర్చుకున్న మరో ప్రధాన సూత్రం… రోజూ పడుకునే ముందు మన ఆస్తులెంత, అప్పులెంత అనేది విధిగా మననం చేసుకోవాలి. ఒక్క సినిమా సక్సెస్ అయితే రెచ్చిపోయి, పార్టీలపై పార్టీలు ఇస్తూ, నోటికి వచ్చినట్లు మాట్లాడితే… ఇక మన పని గోవిందా.
రామానాయుడు, నిర్మాత, సినిమా, D. Rama Naidu, Producer.