మన చీరసారె కట్టుబొట్టు గాజులు కుంకుమలు పసుపుపారాణి లంగావోణీ పూలు కాలిమెట్టెలు తాళి వగైరాలన్ని రాబోయే 50 యేండ్లలో కనుమరుగైతాయనడంలో అతిశయోక్తిలేదు.
ఇప్పటికే సగంమంది వీటినిమానేశారు.పాశ్చాత్య దొరణికి మన సంస్కృతి సంప్రాదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
అచార వ్యవహారాలకు సంస్కృతికి మన స్త్రీలే పట్టుకొమ్మలు. వారితోనే ఇన్నాళ్ళుగా మన వైభవం ప్రపంచానికి తెలిసింది. అలాంటి వ్యవస్థ ఇక ఉండబోదు. అలాగని స్త్రీని మూఢచార సంప్రాదాయ చట్రంలో నలిగిపోవాలని కోరుకోవడంలేదు.పాశ్చత్య వ్యవహార శైలిని పరిత్యజించాలని కోరుకోంటున్నానంతే.
దాదాపు 75 సంవత్సరాల క్రిందటివరకు స్త్రీ పురుషులు కొప్పులో పూలు ధరించేవారు. నా వయస్సు 60,
52 సంవత్సరాల క్రిందట పురుషులు కొప్పులు పిలకలు కట్టుకొనేవారు. అంలో పూలు ముడవడం నేను చూశాను. ఆరోజులలో అందరు నిలువునామమో అడ్డ బొట్టో తప్పనిసరిగా దిద్దుకొనేవారు.
స్త్రీపురుష భేదం లేకుండా అందరి మేడలో కంఠెలు ఉండేవి.చేతికి కంకణాలుండేవి.కాళ్ళకు కడియాలుండేవి.స్త్రీలు తమ తాహత్తుకు తగ్గట్టుగా నడుము వడ్డాణం / డాబు ధరించేవారు.
ఎంత బాధపడినా ఏం ప్రయోజనం కాని, ప్చ్, ఇంకొద్దిరోజులకు మన కట్టుబాట్లు,కాకరకాయలు గట్రా మశానంలో కలుస్తాయి కదా!.
మనపూర్వీక అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు అక్కలు చెల్లెల్లు ఎలాంటి ఆభరణాలు ధరించారో ఒకసారి పరిశీలిద్దాం..
కుప్పె, రాగిడిబిళ్ళ కుంకుమరేఖ
పాపిటబొట్టు, కమ్మలు, బావిలీలు
లలిసూర్య చంద్రవంకలు, మాసకము
కెంపురవలపల్లెరుబూవు రావిరేక
బుగడలు నాన్ దీగె, సొగసైన మెడనూలు
కుతికంటు, సరపణ, గుండ్లపేరు,
సరిగె ముక్కర బన్నసరము, లుత్తం
డాలు కంకణంబులు తట్లు, కడియములును
సందిదండలు ఒడ్డాణ మందమైన ముద్రికలు హంసకంబులు మ్రోయుగజ్జె
లలరు బొబ్బిలకాయలు గిలుకు మెట్టె
లాదియగు సొమ్ముదాల్చి యయ్యబల మెరయు.
చివరిపాదాన్ని చూడండి. ఆ అబల పైన పెర్కొన్న సొమ్ములు ధరించి మెరిసిమురిసిపోతోందట.
ఇక నారాయణకవి చెప్పిన ఈ పద్యంలో మనకు తెలిసిన ఆభరణాలెన్నో తెలుసుకొందాం
కుప్పె = జడకుప్పెలు
రాగిడిబిళ్ళ = ఇది మనకు తెలిసిందే పునకలో ధరించే బిళ్ళ.
కుంకుమరేఖ = తెలియదు. బహుశా నుదుటన ఉంచుకొనే బాణపుకొనలావున్న బొట్టును పోలిన ఆభరణం కావచ్చు.
పాపిట బొట్టు = తెలిసినదే.
కమ్మలు = తెలిసినవే
బావిలీలు = తెలియదు.
సూర్య చంద్రవంకలు = బహుశా సూర్యాకారంలా గుండ్రంగాను, చంద్రవంకలాగా వున్న ఆభరణ విశేషం కావచ్చు. తలలో అలంకరించుకొంటారనుకొంటా.
మాసకముకెంపు = తెలియదు. కెంపులు పొదిగిన మాసకం కావచ్చు.
రవలపల్లెరుపూవు = పల్లెరుపూలు అందంగా వుంటాయి.కాని పల్లెరు ముండ్లు గుచ్చుకొంటే తెగ బాధిస్తాయి. రవలతో పొదిగిన పల్లెరుపూవులాంటి ఆభరణం.
రావిరేక, బుడగలు = తెలియదు.
నాన్ దీగె = తెలుసు
సొగసైన మెడనూలు = మెడలో అలంకరించుకోటానికి బంగారు మరియు నూలుతో అందంగా చేసిన ఆభరణం కామోసు.
కుతికంటు = కుతి అంటే కుత్తుక. గొంతుకు అలంకంరించే కంటు.
సరిపణ = గొలుసులు.
గుండ్లపేరు = మనకు తెలుసు
సరిగె = విన్నాను కాని సరిగా గుర్తులేదు.
ముక్కర = తెలుసు
బన్నసరము = బన్న అంటే తెలియదు.సరము అంటే గొలుసు. బన్న = పన్న = పాము = పాము ఆకారంతోనున్న ఆభరణం కావచ్చు.
ఉత్తండాలు = తెలియదు
కంకణంబులు = మనకు తెలుసు
తట్లు = తెలియదు
కడియములు = తెలుసు
సందిదండలు = కొందరికి తెలుసు, నాకు తెలియదు.
ఒడ్డాణం = తెలుసు
మందమైనముద్రికలు = బాగా మందమైన ముద్రికలు (ఉంగరాలు ?)
హంసకంబులు = హంసాకారంలోనున్న ఆభరణం కావచ్చు.
మ్రోయుగజ్జెలు = గల్లుగల్లున మ్రోగే కాళ్ళగజ్జెలు.
అలరు బొబ్బిలకాయలు = బాగా అందమైన బొబ్బిలకాయలవంటి ఆభరణం కావచ్చు. బొబ్బిలికాయలంటే ?
గిలుకుమెట్టెలు = తళుకులీనుతున్న కాలిమెట్టెలు.
ఈ ఆభరణాలన్ని ధరించి ఆ వనితామణి అలరుతోందట.
ఈ ఆభరణాలన్నింటిని తూకం వేస్తే నాలుగుకేజీల బరువైనా ఉండవా అని ?
ఇక తెలియదు అంటే ఈ ఆభరణాల గురించి నాకు తెలియదని అర్థం. ప్రాజ్ఞులకు తెలిసివుంటే మనవి చేయ ప్రార్థన.