మనం సాధారణంగా జలుబు చేసి ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతుంటే ఆవిరి పట్టుకోమంటరు. అందులో నీలగిరి తైలమో లేదా జిందా తిలస్మాతో వేసుకుంటే జలుబు ఇట్టే తగ్గి పోతుంది. జలుబు ఒక్కటే కాదు ఒత్తిడి, అలసట, ముఖం అందంగా మిలమిల మెరవటం వంటి ఎన్నో ఉపయోగాలు ఆవిరి పట్టుకోవడం వల్ల కలుగుతాయి. అవేంటో ఇప్పడు చూద్దాం..
1. రెండు గ్లాసుల నీటిని వేడి చేసి అందులో వన మూలికలు, అవి అందుబాటులో లేకుంటే, కనీసం టీ బ్యాగులను ఉంచి ఆవిరి పట్టుకున్నా, ముఖం తాజాగా మెరిసిపోతుంది. ఇదే సమయంలో కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగలడమే కాకుండా, సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి.
2. దైనందిన జీవితం పని ఒత్తిడితో అలసి పోతున్న వేళ, కండరాలను ఉత్తేజింప చేసేందుకు ఆవిరి పట్టుకోవడం అత్యుత్తమ మార్గాల్లో ఒకటి. దీని వల్ల తిన్న ఆహారం సాఫీగా జీర్ణం కావడంతో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. నీటిలో పుదీనా ఆకులను వేసుకోవడం, నిమ్మగడ్డిని ఉంచడం, యూకలిప్టస్ ఆకులతో తయారైన నూనెను వేయడం వల్ల చిన్నారులకు జలుబు దూరమవుతుంది.
4. ఉబ్బసం, ఆయాసం, జలుబు వంటి రుగ్మతలతో బాధపడుతున్న వేళ ఏర్పడే ముక్కుదిబ్బడ నుంచి ఆవిరి పట్టడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. ఆపై సులభంగా ఊపిరి పీల్చుకోగలుగుతారు కూడా.