DailyDose

$1 = ₹76.83 – వాణిజ్యం

 = ₹76.83 – వాణిజ్యం

* దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి రికార్డు పతనాన్ని నమోదు చేసింది. మంగళవారం ఆరంభంలో 76.79 వద్ద బలహీనపడిన రూపాయి, అనంతరం డాలరు మారకంలో 30 పైసలు తగ్గి 76.83 కు చేరుకుంది. ముడి చమురు రికార్డు పతనం, దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలడంతో రూపాయి మరోసారి భారీగా నష్టపోతోంది. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 76.53 వద్ద స్థిరపడింది. అటు డాలరు 100 స్థాయి మార్కును అధిగమించడంతో పెట్టుబడిదారులు రూపాయిలో అమ్మకాలకు దిగారని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగి 100.15 కు చేరుకుంది. చరిత్రలో మొదటిసారిగా యుఎస్ ముడి ఫ్యూచర్స్ మైనస్ లోకి పడిపోయింది. చమురు డిమాండ్ పతనం, కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ తెలిపింది. ఈ వారంలో కార్పొరేట్ ఆదాయాల ప్రకటన, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక నష్టం అంచనాలతో పెట్టుబడిదారుల అప్రమత్తత కొనసాగుతుందని పేర్కొంది. డబ్ల్యుటిఐ ముడి చమురు ఫ్యూచర్స్ రికార్డు పతనాన్ని నమోదు చేయగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.78 శాతం పడిపోయి బ్యారెల్కు 25.37 డాలర్లకు చేరుకుంది. అంతేకాకుండా, కరోనా కేసులు గణనీయంగా పెరగడం ఆర్థికవ్యవస్థపై భారం పడుతుందనే ఆందోళన ఉధృతమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 24.81 లక్షలకు పైగా కేసులు నమోదుగా భారతదేశంలో ఇప్పటివరకు దాదాపు 18,600 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

* చమురు ధరలు భారీగా పతనం కావడం, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తమ దేశంలోకి వలసల్ని తాత్కాలికంగా నిషేధించనున్నామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన కూడా మదుపర్లు సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలుస్తోంది. సెన్సెక్స్ 31 వేల స్థాయిని, నిఫ్టీ 9,100 దిగువకు చేరుకున్నాయి. ఉదయం 9.52 గంటల సమయంలో సెన్సెక్స్‌ 829 పాయింట్లు కోల్పోయి 30,826 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 232 పాయింట్లు నష్టపోయి 9,029 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.91 వద్ద ట్రేడవుతోంది.

* నిర్దిష్ట దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రాకుండా తీసుకొచ్చిన నిబంధనలపై చైనా అభ్యంతరాన్ని మంగళవారం భారత్ కొట్టిపారేసింది. ఆ నియమాలు అనుమతి తిరస్కరణ కిందికి రావని, ఆమోద ప్రక్రియ మాత్రమేనని, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలపై చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రాంగ్ స్పందిస్తూ..ఇలా అదనపు అడ్డుగోడలు సృష్టించడం డబ్ల్యూటీఓ నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆరోపించారు. జీ20 సమావేశాల్లో తీసుకున్న నిర్ణయానికి భారత్ చర్యలు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.

* గత ఆర్థిక సంవత్సరం చివరకు దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పి-నోట్ల) ద్వారా పెట్టుబడులు 15 ఏళ్ల కనిష్ఠమైన రూ.48,006 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి తోడు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మాంద్యం ఏర్పడుతుందనే భయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రూ.67,281 కోట్లు, ఫిబ్రవరిలో రూ.68,862 కోట్ల పెట్టుబడులు పి-నోట్ల రూపంలో వచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదార్లు (ఎఫ్‌పీఐ) భారత స్టాక్‌మార్కెట్లలో పి-నోట్ల ద్వారా పెట్టుబడులు పెడుతుంటారు.

* కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో, సోమవారం సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆరంభ భారీ లాభాలు ఆవిరైపోయినా, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు, ఆర్‌ఐఎల్‌, ఐటీ షేర్లు ఆదుకోవడంతో, స్వల్ప లాభాలతో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు నష్టంతో 76.53 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై మినహా అన్ని నష్టాల్లో ముగిశాయి. ఐరోపా షేర్లు ప్రతికూలంగా ట్రేడయ్యాయి.