జూమ్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా యాప్‌ను ఆవిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ‘వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ డెవలెప్‌మెంట్ ఛాలెంజ్’ను నిర్వహిస్తోంది. దీనిలో విజేతగా నిలిచిన వారికి రూ.కోటి అందిస్తామని ప్రకటించింది. అయితే భారత సంస్థలు మాత్రమే దీనిలో పాల్గొనాలని తెలిపింది. లాక్‌డౌన్ నేపథ్యంలో జూమ్ యాప్ వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే దానిలో భద్రతా సమస్యలు తలెత్తడంతో ఆ యాప్ ఉపయోగించడం శ్రేయస్కరం కాదని కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇటీవల పేర్కొంది. కానీ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో ఈ మేరకు వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారానికి నూతన ఆవిష్కరణ ఛాలెంజ్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. యాప్ డెవలెప్‌మెంట్ ఛాలెంజ్‌లో పాల్గొనే వారు ఈ నెల 13 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. యాప్ ఎలాంటి డివైస్‌లో అయినా వినియోగించుకునేలా, నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థంగా పనిచేసేలా, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌తో తక్కువగా బ్యాటరీని వినియోగించుకునేలా తయారు చేయాలని సూచించింది. విజేతను జులై 29న ప్రకటిస్తామని పేర్కొంది. రూ.కోటి బహుమతితో పాటు ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ సర్టిఫికెట్ ఇస్తామని వెల్లడించింది.
ఇండియా ప్రభుత్వ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఛాలెంజ్
Related tags :