* మే 3 తర్వాత ఏం జరగనుంది? దేశవ్యాప్త లాక్డౌన్ను కొనసాగించే అవకాశాలైతే కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దాని గురించి చర్చించలేదని సమాచారం. ఐతే లాక్డౌన్ ఎత్తేశాక షరతులు, పరిమితులతో కూడిన జీవనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. విమానాలు, రైళ్లు మే 3 తర్వాత సేవలు ఆరంభించవని తెలుస్తోంది. కొన్ని రోజులకు నిర్దేశించిన పట్టణాల మధ్య ప్రయాణాలకే అనుమతి ఇస్తారని సమాచారం. కొన్నాళ్లు మాస్క్లు, వ్యక్తిగత దూరం జీవితంలో భాగం కానున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే మాస్క్ ఉంటేనే అనుమతి ఇస్తారట. పెళ్లి వంటి శుభకార్యాలు, మత సమ్మేళనాలపై ఆంక్షలు కొనసాగుతాయి. నిత్యావసరాల దుకాణాలు వ్యక్తిగత దూరం పాటిస్తూ, వినియోగదారులతో పాటింపజేస్తూ అమ్మకాలు జరపొచ్చు.
* కరోనా వైరస్ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. తమ దేశంలోకి వలసల్ని(ఇమ్మిగ్రేషన్) తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘‘ఓ అదృశ్య శక్తి(కరోనా వైరస్) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉండదు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ ఉభయ దేశ వాసులదే సింహభాగం. ట్రంప్ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని..అంతా సక్రమంగానే జరుగుతోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగదని.. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తెదేపా నుంచి వెళ్లిన నేతలతో భాజపా ప్రతిష్ఠ దెబ్బతింటోందని విమర్శించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కన్నా అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని వ్యాఖ్యానించారు.
* ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. గుండె శస్త్ర చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ పేర్కొంది. కిమ్ పరిస్థితి గురించి ఓ అమెరికా ఉన్నతాధికారి చెప్పారని సీఎన్ఎన్ తెలిపింది. ఈ నెల 15న జరిగిన కిమ్ ఈఈ సంగ్ జయంతి వేడుకలకు కిమ్ గైర్హాజరు అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. అయితే సీఎన్ఎన్ కథనాన్ని ధ్రువీకరించలేమని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఆ దేశం తోసిపుచ్చింది.
* కరోనా భయంకరమైన వైరస్ … దానికి నివారణే తప్ప మరో మార్గం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ మహమ్మారిని తక్కువ అంచనా వేయెద్దని, కప్పి పుచ్చే ప్రయత్నం చేయవద్దని మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నామన్నారు. ‘‘మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిన్న కేసులు పెరిగాయి. మేం చెప్పేదాన్ని మీరు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో చెలగాటం వద్దు. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రెడ్ జోన్లు ఉన్నాయి. హాట్స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్ప కరోనాను నివారించలేం. వైద్యులు, సిబ్బందికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? వైద్యులకు మాస్క్లు, పీపీఈలు ఇస్తున్నారా? కరోనాపై క్షేత్రస్థాయిలో యుద్ధం చేసే వారిని మనం రక్షించుకోవాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అనేక సార్లు కోరాం… అయినా పట్టించుకోలేదు’’ అని చంద్రబాబు విమర్శించారు.