* చమురు ధరలు పతనం కావడంతో నిన్న కుదేలైన మార్కెట్లు నేడు కోలుకున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియోలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ భారీ పెట్టుబడులు పెట్టనుందన్న వార్త మార్కెట్‌కు ఊతం ఇచ్చింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్742 పాయింట్లు లాభపడి, 31,379 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 205 పాయింట్ల లాభంతో 9వేల మార్కును దాటి, 9,187 వద్ద స్థిరపడింది. రూపాయితో డాలర్ మారకం విలువ రూ.76.67 వద్ద కొనసాగుతోంది.
* కరోనా వైరస్ ప్రభావంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌లోనే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల వాడకం కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ కారణంగా చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోవడంతో అదేస్థాయిలో ధర పడిపోయింది. తాజాగా బుధవారం నాడు రికార్డు స్థాయిలో బ్యారెల్‌కు 16డాలర్లకు పతనమయ్యింది. దీంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర గత తగ్గింపుతో పోలిస్తే 24శాతం పడిపోయి దాదాపు 16డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ(వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) ధర 11.42 డాలర్లకు పడిపోయింది. 1999 తరువాత బ్రెంట్ క్రూడాయిల్ అత్యల్ప ధరకు పడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. వివిధ దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా చమురుకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది.
* ఆడిట్ సంస్థలు బీఎస్‌ఆర్ అండ్ అసోసియేట్స్, డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌కు బోంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ మాజీ ఆడిటర్లయిన ఈ సంస్థలపై ప్రాసిక్యూషన్‌ను కొట్టివేస్తూ కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)తో పాటు ముంబయిలోని ప్రత్యేక కోర్టులో కూడా ఈ సంస్థలకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఆడిటర్లుగా తమను తొలగించాలని కోరుతూ ఎన్‌సీఎల్‌టీకి ప్రభుత్వం దరఖాస్తు చేయడాన్ని బోంబే హైకోర్టులో ఆడిటింగ్ సంస్థలు సవాలు చేశాయి. కంపెనీల చట్టంలోని సెక్షన్ 140(5) కింద ఆడిటింగ్ సంస్థలపై విచారణ జరిపి, ఆడిటింగ్ నుంచి అయిదేళ్ల పాటు నిషేధం విధించాలన్నది ప్రభుత్వ వాదన. దీనిపై న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ బీపీ ధర్మాధికారి, జస్టిస్ ఎన్‌ఆర్ బోర్కర్‌లతో కూడిన బెంచ్ మంగళవారం తీర్పు చెబుతూ, ఎన్‌సీఎల్‌టీ వద్ద ఈ సంస్థలపై జరుగుతున్న విచారణను రద్దు చేసింది. కంపెనీల చట్టంలోని సెక్షన్ 140 (5) ఈ కేసులో ఆడిటింగ్ సంస్థలకు వర్తించదని తెలిపింది. బీఎస్‌ఆర్ ముందుగానే రాజీనామా చేయగా, కేసు ఎన్‌సీఎల్‌టీకి చేరకముందే డెలాయిట్‌ను ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ మార్చడమే ఇందుకు కారణమని వివరించింది.
* పన్ను బాకీ ఉన్న వ్యక్తులతోపాటు అంకుర సంస్థలు, కంపెనీలకు కలిసి మొత్తం 1.72 లక్షల మందికి ఇ-మెయిళ్లను జారీ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో పన్ను బాకీ ఉన్నవారితోపాటు, రిఫండు కోరిన వారు తమ వివరాలను మరోసారి ధ్రువీకరించాలని సూచించినట్లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు నగదును అందుబాటులోకి తెచ్చేందుకు ఆదాయపు పన్ను రిఫండు క్లెయింలను వేగంగా పరిష్కరిస్తామని ఏప్రిల్ 8న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. ఇప్పటికే రూ.9,000 కోట్ల విలువైన 14 లక్షల రిఫండ్ క్లెయింలను పరిష్కరించినట్లు తెలిపింది. పన్ను బాకీ ఉన్నవారికి మరో అవకాశాన్ని ఇవ్వడంతోపాటు, దాని తాజా పరిస్థితిని తెలుసుకోవడం కోసమే వీటిని పంపించామని పేర్కొంది. అసెసీలు పన్ను బాకీ ఉంటే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 245 ప్రకారం ఇవి వస్తాయని తెలిపింది. ఇందులో ఉన్నట్లు పేర్కొన్న పన్నును ఇప్పటికే చెల్లించారా? లేదా దానిపై ఏదైనా ఫిర్యాదు నమోదు చేశారా? అనే తాజా సమాచారాన్ని తెలియజేస్తే సరిపోతుందని చెప్పింది. రిఫండు కోరిన వారు ఇచ్చిన సమాధానాన్ని బట్టే అడిగిన మొత్తాన్ని చెల్లించాలా? లేక పన్ను బాకీని మినహాయించుకోవాలా అన్నది నిర్ణయిస్తామని సీబీడీటీ పేర్కొంది. కొన్ని సామాజిక వేదికల్లో వస్తున్నట్లు ఇవన్నీ పన్ను డిమాండు నోటీసులు లేదా బాకీని రిఫండు నుంచి సర్దుబాటు చేయడంలాంటివి కాదని.. కేవలం పన్ను చెల్లింపుదారుల నుంచి సరైన సమాచారాన్ని తీసుకోవడం మాత్రమేనని తెలిపింది. సమాధానాలు పంపించిన వారికి సాధ్యమైనంత తొందరగా రిఫండునిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
* వచ్చే ఏడాది మార్చి నాటికి రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక రేట్లలో మరో 75 బేసిస్ పాయింట్లు (0.75%) కోత విధించే అవకాశం ఉందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇప్పటి వరకు ప్రకటించిన రేట్ల కోతలు సరిపోవని అభిప్రాయపడింది. 2021 మార్చికి ఆర్‌బీఐ మరో 75 బేసిస్ పాయింట్లు తగ్గించి రెపో రేటును 3.65 శాతం, రివర్స్ రెపో రేటును 3 శాతంగా చేయొచ్చని పేర్కొంది. ఈ నెల 17న ఆర్‌బీఐ నగదు లభ్యత పెంచేందుకు రివర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గి 3.75 శాతంగా చేసింది. రెపో రేటు 4.40 శాతంగా ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన రేట్ల కోతలు సరిపోవని భావిస్తున్నామని, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే కీలక రేట్లను తగ్గించడం సులభతరం అవుతుందని తెలిపింది. ‘చిన్న, మధ్య తరహా సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. సమీప భవిష్యత్‌లో రుణాలకు గిరాకీ మందకొడిగా ఉండొచ్చు. 2020-21లో పెద్ద కంపెనీలు మూలధన వ్యయాలను తగ్గించుకునే అవకాశం ఉంది’ అని ఆర్‌బీఐ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే.
* దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో అమలు చేస్తున్న ‘ఉద్యమ్ అభిలాష’ కార్యక్రమంతో నిరుద్యోగం 25 శాతం వరకూ తగ్గింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. అంతేకాకుండా.. ఎంతోమంది యువతీయువకులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారబోతున్నట్లు తేలింది. ఉద్యమ్ అభిలాష కార్యక్రమాన్ని సిడ్బీ (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని 2018లో ప్రారంభించింది. గ్రామీణ ప్రాంత యువతీయువకులకు వారు ఎంచుకున్న రంగాల్లో తగిన శిక్షణ ఇచ్చి, నిరుద్యోగాన్ని తగ్గించడంతోపాటు, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖకు చెందిన సీఎస్‌ఈ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియాతో చేతులు కలిపి సిడ్బీ దీన్ని అమలు చేస్తోంది. దీనివల్ల ఏ మేరకు ఫలితాలు వస్తున్నాయనే అధ్యయాన్ని ఇటీవల ఐఎస్‌బీ చేపట్టింది. కొంతమేరకు సానుకూలమైన ఫలితాలే సాధించినట్లు పేర్కొంటూ.. మరికొన్ని సూచనలనూ ఐఎస్‌బీ చేసింది. శిక్షణ తీసుకున్న వారిలో పని సామర్థ్యం బాగా పెరిగినట్లు, సగటున పది మందిలో 7.5మంది సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. 50శాతానికన్నా ఎక్కువ మంది రాబోయే ఆరు నెలల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవకాశముందని పేర్కొంది. అభ్యర్థులు శిక్షణకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటంతోపాటు, డిజిటల్ శిక్షణను ప్రోత్సహించాలని సూచించింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త తరహా కోర్సులను అందించాల్సిన అవసరముందని తెలిపింది.