Fashion

లెన్స్‌లు సరిగ్గా శుభ్రం చేస్తున్నారా?

లెన్స్‌లు సరిగ్గా శుభ్రం చేస్తున్నారా?

కాంటాక్టు లెన్స్‌లు వాడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులివి. వీటి ద్వారానూ కరోనా వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని రట్గర్స్‌ మెడికల్‌ స్కూల్‌ ఆప్తల్మాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ చూ పలు సూచనలు చేశారు. కాంటాక్ట్‌ లెన్సుల ద్వారా కరోనా సోకినట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే లెన్సులు కళ్లకు చికాకు కలిగిస్తాయి. వాటిని వాడేవారు ఎక్కువగా కళ్లను తాకడం, రుద్దడం చేస్తుంటారు. ఈ రకంగా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పొంచి ఉంది. లెన్స్‌ వాడేవారు పరిశుభ్రత పాటించాలి. ధరించేముందు కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఆరిన చేతులతోనే లెన్సులు తాకాలి.
1 ఈ సమయంలో లెన్సుకు బదులుగా కళ్లజోడుకు మారాలని ఎలాంటి సిఫారసులు లేవు. అయితే వైరస్‌ సోకేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారు, ఇప్పటికే వ్యాధి సోకిన వారితో కలిసి నివసిస్తున్న వారు అద్దాలకు మారడం ఉత్తమం.
2 కరోనా వైరస్‌ను కన్నీళ్లలోనూ గుర్తించినప్పటికీ అది అసాధారణమే. కన్నీటి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందా అన్నది నిర్థారణ కాలేదు. అందుకు చాలావరకు అవకాశం లేదు.
3 సాధారణంగా కండ్లకలక, కళ్లు గులాబీ రంగులోకి మారాయంటే కణజాలం వాపు, అలర్జీ వల్ల వస్తాయి. అయితే కరోనా వైరస్‌ అరుదైన లక్షణాలలో కండ్లకలక ఒకటని గుర్తించాలి.
4 లెన్స్‌ వాడుతున్న వారికి కండ్లకలక వస్తే వెంటనే మానేయాలి. లేకుంటే కార్నియాపై రాపిడి పెరిగి ఇన్‌ఫెక్షన్‌, నొప్పితో పాటు చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.
5 లెన్స్‌ తయారీదారు, కంటి వైద్యుల సూచనలు పాటించాలి. నిద్రించేముందు లెన్సు తీసేయాలి. తొలగించే సమయమైనా, తిరిగి ధరించే సమయంలో అయినా చేతుల శుభ్రత ముఖ్యం. తీసిన వాటిని ఇన్‌ఫెక్షన్‌ సోకని సురక్షిత ప్రాంతంలో ఉంచాలి.