పొగాకులో ఉండే నికోటిన్ ఓ విషపదార్థం. మనుషుల్ని బానిసలుగా చేసుకునే ఓ మాదకద్రవ్యం లాంటిది. కానీ అదే నికోటిన్ ఇప్పుడు కరోనాకు అడ్డుకట్ట వేసే దివ్యౌషధం అవుతుందేమోనని సరికొత్త ఆలోచన మొదలైంది. దీనిపై ఫ్రాన్స్‌లో పరీక్షలు జరుగుతున్నాయి. పొగాకు పొగ పీల్చినా, నమిలినా నికోటిన్ రక్తంలోకి రవాణా అవుతుంది. ఇదే నిన్నచిదాకా సమస్య. ఇప్పుడు అదే పరిష్కారం చూపుతుందేమో అంటున్నారు. సమాజంలో ఉన్న పొగరాయుళ్ల నిష్పత్తితో సమానంగా కరోన రోగులు లేకపోవడం ఇటువైపుగా ఆలోచించడానికి దారితీసింది. నికోటిన్‌కు ఉన్న చెడ్డ లక్షణం మానవ కణాల రిసెప్టర్స్‌కు అతుక్కోవడం. ఆ లక్షణం కారణంగా అది వైరస్ కణాలలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందన్నది సిద్ధాంతం. దీనిపై ప్రాన్స్ లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. తదుపరి పరిశోధనలకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. పొగతాగడం గురించి ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఎడాపెడా పొగతాగితే కరోనా రాదని ఎవరూ చెప్పడం లేదు. దాని దుష్ప్రభావాలు దానికి ఉండనే ఉన్నాయి. వైద్య పరిశోధకులు మాత్రం నికోటిన్ ప్యాచ్‌లతో కరోనా పరీక్షలు జరపాలని భావిస్తున్నారు. కరోనా రాకుండా నిలువరించేందుకు, కరోనా వ్యాధికి చికిత్సకు ఈ ప్యాచ్‌లతో పరీక్షలు జరిపే విషయమై ప్రభుత్వ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి స్థాయి పరిశోధన జరిగేంతవరకు ఎవరూ తొందరపడి ఇదొక నిరోధకంగానో, చికిత్సావిధానంగానో పనిచేస్తుందనే నిర్దారణలకు రావద్దని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ పెద్దలు హెచ్చరిస్తున్నారు.