Sports

సచిన్ జోలికి వెళ్లొద్దన్న మెక్‌గ్రాత్

Brett Lee Recalls McGrath's Suggestions

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌తో మాట్లాడొద్దని, ఒకవేళ మాట్లాడితే తర్వాత బాధపడతావని మెక్‌గ్రాత్‌ తనతో చెప్పినట్లు ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌లీ గుర్తుచేసుకున్నాడు. క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టును స్లెడ్జింగ్‌కు మారుపేరుగా చూస్తారు. ఆ జట్టులో పేరొందిన దిగ్గజ బౌలర్లంతా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను స్లెడ్జింగ్‌ చేసినవాళ్లే. ఇదే అంశంపై బ్రెట్‌లీ ఇటీవల స్టార్‌స్పోర్ట్స్‌ ఛానల్‌లో ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ మెక్‌గ్రాత్‌ తనను సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేయొద్దని చెప్పాడని తెలిపాడు. ‘మా జట్టులో ఎప్పుడూ ఒక బౌలింగ్‌ కెప్టెన్‌ ఉండేవాడు. నేను జట్టులోకి వచ్చినప్పుడు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ఉన్నాడు. అతనెప్పుడూ యువ బౌలర్లకు ఒకే విషయం చెప్పేవాడు. అది మిచెల్‌‌ జాన్సన్‌ అయినా, మరెవరైనా.. టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ సచిన్‌‌తో మాట్లాడొద్దని. ఒకవేళ మాట్లాడితే, ఆరోజు ఆ బౌలర్‌ బాధపడక తప్పదని పేర్కొన్నాడు. మెక్‌గ్రాత్‌ అదే చెప్పాడు. మా బౌలింగ్‌ సమావేశాల్లోనూ ఇదే చర్చకువచ్చేది’ అని బ్రెట్‌లీ వివరించాడు. అందువల్లే తమ జట్టు ఎప్పుడూ సచిన్‌ను స్లెడ్జింగ్‌ చేయకపోయేదని అసలు విషయం వెల్లడించాడు. క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్‌బ్లాస్టర్‌ తన కెరీర్‌లో ఆసీస్‌పై ఎన్నోసార్లు ఆధిపత్యం చెలాయించాడు. మెక్‌గ్రాత్‌, షేన్‌వార్న్‌, బ్రెట్‌లీ లాంటి దిగ్గజాలను సైతం ఉతికారేసిన సంగతి తెలిసిందే.