Movies

హ్యాపీ బర్త్‌డే…సమంత అక్కినేని

హ్యాపీ బర్త్‌డే…సమంత అక్కినేని

తెలుగు చిత్రసీమలో స్టార్‌ కథానాయికలుగా ఎదిగిన భామలు ఎంతోమంది. సమంత మాత్రం అత్యంత వేగంగా ఆ స్థాయికి చేరుకొంది. తొలి చిత్రం ‘ఏమాయ చేసావె’తోనే ఆమె తెలుగు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఆ తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది. ప్రతి సినిమాతోనూ ఓ మెట్టు ఎక్కింది సమంత. అటు కమర్షియల్‌ కథలకి తగ్గ కథానాయికగా… నటనకి ప్రాధాన్యమున్న పాత్రలకి కేరాఫ్‌గా నిలుస్తూ అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు సమంత అంటే ఓ బ్రాండ్‌. ఆమె సినిమాలో నటిస్తుందంటే అంచనాలు అమాంతం పెరిగిపోతుంటాయి.

Samantha thanks for her birthday wishes

ఇటీవల కాలంలో ప్రతి సినిమాలోనూ తన నటనతో ప్రేక్షకుల్ని మాయ చేస్తోంది. చెన్నైలోని పల్లవరంలో 1987 ఏప్రిల్‌ 28న జన్మించింది సమంత. ఆమె తండ్రి తెలుగువారు కాగా, తల్లి మలయాళీ. హోలీ ఏంజిల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె స్టెల్లా మేరీస్‌ కాలేజీలో డిగ్రీ చదువుకుంది. డిగ్రీ చివరి సంవత్సరంలోనే మోడలింగ్‌వైపు అడుగులేసిన ఆమె దర్శకుడు రవివర్మన్‌ దృష్టిలో పడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మాస్కోవిన్‌ కావేరీ’ చిత్రంలో కథానాయికగా అవకాశం అందుకుంది. కానీ సమంత జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం గౌతమ్‌ మేనన్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావె’లో నాగచైతన్య సరసన సమంత నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించడంతోపాటు, సమంత అందం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. దాంతో ఆమెకి తెలుగులో అవకాశాలు వెల్లువెత్తాయి.

ఎన్టీఆర్‌తో కలిసి ‘బృందావనం’, మహేష్‌తో కలిసి ‘దూకుడు’, రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. ఆ చిత్రాలు ఘన విజయం సాధించడంతో అగ్ర కథానాయికగా ఎదిగింది సమంత. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’తో నటన పరంగా కూడా తన ప్రతిభని చాటి చెప్పింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’, ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యు టర్న్‌’తో పాటు… ఇటీవల విడుదలైన ‘యు టర్న్‌’ సమంతకి ఎంతగానో పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’తో పాటు, నాగార్జునతో కలిసి ‘మన్మథుడు2’లో నటిస్తోంది సమంత. ‘ఏమాయ చేసావె’తో ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాన్ని అందుకున్న సమంత, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’తో ఉత్తమ నటిగా నంది సొంతం చేసుకున్నారు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సమాంతరంగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు సమంత. సమంత తమిళ కథానాయకుడు సూర్యకి వీరాభిమాని అట. ఆయన ఒక వేడుక కోసం సమంత చదువుకుతున్న స్టెల్లా మేరీస్‌ కాలేజీకి రావడం చూసి ఒక అభిమానిగా ఎంతో సంతోషించారట. అలాంటి కథానాయకుడి సరసన నటించే అవకాశం అంటే కల నిజమైనట్టే కదా! సమంత ఆ కలని నిజం చేసుకుంది. ఇద్దరూ కలిసి ‘అంజాన్‌’, ‘24’ చిత్రాల్లో నటించారు. తెలుగులో తొలి చిత్రం చేస్తున్నప్పుడే సహ నటుడైన నాగచైతన్యతో ప్రేమలో పడిన సమంత, ఇద్దరూ కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు. ఆమె అసలు పేరు సమంత రూత్‌ ప్రభు కాగా, నాగచైతన్యని వివాహం చేసుకొన్నాక సమంత అక్కినేనిగా పేరు మార్చుకున్నారు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబంతో చక్కగా కలిసిపోయిన సమంత కథానాయికగా కొనసాగుతూనే.. నాగచైతన్యతో వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సమంత చురుగ్గా పాల్గొంటుంటారు. ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళలకి, చిన్నారులకి తగిన సహాయాన్ని అందిస్తుంటారు. తొలి చిత్రంతోనే తన నటనతో మాయ చేసి మనసులు గెలుచుకున్న సమంత పుట్టినరోజు ఈరోజు.