Sports

అన్నా అన్నాడు…రిటైర్ అవ్వాలనుకున్నాను

అన్నా అన్నాడు…రిటైర్ అవ్వాలనుకున్నాను

లాక్‌డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన టీమ్‌ఇండియా క్రికెటర్లు సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌ బాటపట్టారు. ఈమధ్య అందులో ఇతర క్రికెటర్లతో లైవ్‌చాట్‌ చేస్తూ తమకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటున్నారు. వారి మధ్య చర్చకు వస్తున్న ఎన్నో విషయాలు అభిమానులకు ఆసక్తిగా మారాయి. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ నుంచి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా వరకు అందరూ లైవ్‌ ఇంటర్వ్యూలతో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబయి ఇండియన్స్‌ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, బుమ్రా తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొని ముచ్చటించారు. ఈ సందర్భంగా యువీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండేళ్ల క్రితం యువీ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ ఆండ్రూ టై తనని ‘యువీ పా’ (‘పా’ అంటే సహజంగా పెద్దన్న అని అర్ధం) అని పిలిచాడని, దాంతో తనకు మొదటిసారి రిటైర్మెంట్‌ గురించి ఆలోచన వచ్చిందని టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ చెప్పాడు. అలాగే తన కెరీర్‌ చివరి దశలో టీమ్‌ఇండియాతో ఆడేటప్పుడు కూడా రిటైర్మెంట్‌పై ఆలోచనలు వచ్చాయని యువరాజ్‌ అన్నాడు. అనంతరం బుమ్రా బౌలింగ్‌పై స్పందిస్తూ.. మూడేళ్ల క్రితమే అతడి బౌలింగ్‌ చూసి ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌ అవుతాడని ఊహించినట్లు యువీ పేర్కొన్నాడు. ఆపై బుమ్రా అందుకొని.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తాను రాక ముందు ఏం జరిగిందో చెప్పాడు. తన బౌలింగ్‌ను చూసి చాలా మంది విమర్శించారని చెప్పాడు.