Politics

రష్యాలో కలిశారు

kim putin meets in russia

అణ్వాయుధాల వాడకంపై అమెరికాతో ప్రతిష్ఠంభన నెలకొన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమావేశమయ్యారు. రష్యా వ్లాదివోస్తోక్‌లోని ఫార్‌ ఈస్ట్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. దీనికోసం కిమ్‌ ప్రత్యేక రైలులో నిన్ననే వ్లాదివోస్తోక్‌ చేరుకోగా.. పుతిన్‌ ఈరోజు అక్కడికి వచ్చారు. పుతిన్‌ ఎదురొచ్చి కిమ్‌కు స్వాగతం పలికారు. ఇరువురు కరచాలనం చేసుకుని పలకరింపుల తర్వాత చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మద్దతు ఇస్తున్నట్లు పుతిన్‌ తెలిపారు. కొరియాలో శాంతికి ఏం చేయాలో రష్యా అర్థం చేసుకునేందుకు కిమ్‌ పర్యటన దోహదం చేస్తుందని పుతిన్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. 2011లో ఉత్తరకొరియాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పాలనాపగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన సమావేశమైన ఆరో దేశాధినేత పుతిన్‌ మాత్రమే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో రెండోసారి సమావేశం విఫలమైన తర్వాత రష్యా అధినేత పుతిన్‌తో కిమ్‌ సమావేశంతో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.