* కరోనా టెస్టు కిట్ల సమస్య తీర్చేందుకు కేంద్రం నడుం బిగించింది. స్వదేశంలోనే వీటిని తయారు చేసేందుకు కసరత్తు ఆరంభించింది. మే నెలాఖరుకు భారత్‌లోనే ఆర్టీ-పీసీఆర్, యాంటీ బాడీ టెస్టు కిట్లను ఉత్పత్తి చేస్తామని కేంద్ర వైద్యశాఖ మంత్రి, డాక్టర్ హర్షవర్దన్ అన్నారు.
* దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పాజిటివ్ కేసుల రేటు తక్కువగా ఉందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 80 నుంచి 90 శాతం ఇప్పటికే ఉన్న క్లస్టర్లలోనే వచ్చాయన్నారు. ప్రతి 10 లక్షల మందిలో 1,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జవహర్ రెడ్డి వివరించారు. తమిళనాడు, రాజస్థాన్ కంటే ఏపీలోనే ఎక్కువ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజ్‌భవన్‌లో నలుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ భద్రతాధికారి, స్టాఫ్‌నర్సు, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్‌కు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు జవహర్‌రెడ్డి తెలిపారు. మిగతా సిబ్బందికీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చిందన్నారు.
* లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఇవాళ స్వస్థలాలకు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లోకి రావడంతో దాదాపు 5 వేల మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి అక్కడే ఉండిపోవడంతో వారి సమస్యను ఇటీవలే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లడంతో వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరావల్‌లో ఉన్నవారిని అక్కడ నుంచి బస్సుల్లో పంపించేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. వీరంతా కాసేపట్లో అక్కడనుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* రాష్ట్రంలో దాదాపు 3 లక్షల జన్‌ధన్ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమచేసిన రూ.16కోట్లకు పైగా నగదును తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ) వెనక్కి తీసుకుంది. దేశంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో జన్‌ధన్ ఖాతాల్లో నెలకు రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఆయా ఖాతాల్లో ఈనెల మొదటివారంలో దేశవ్యాప్తంగా నగదు జమ చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9లక్షల మంది ఖాతాల్లో ఏప్రిల్ నెలకు చెందిన రూ.500 చొప్పున జమ అయ్యాయి. అయితే వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారిని అనర్హులుగా బ్యాంకు తేల్చింది. ఇప్పటికే అనర్హుల ఖాతాల్లో జమ చేసిన సుమారు రూ.16కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం మహేశ్ తెలిపారు. 1 ఆగస్ట్, 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేల్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హులకు జమచేశామని.. వారంరోజుల తర్వాత గుర్తించి వెనక్కి తీసుకున్నామని జీఎం వివరించారు. అనర్హుల్లో ఇప్పటికే లక్షకు పైగా ఖాతాదారులు నగదును తీసుకున్నారని.. వారి నుంచి తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
* ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకం ప్రారంభమైంది. ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 12లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా సీఎం.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. ‘‘విద్యా దీవెనలో భాగంగా రెండు పథకాలు తీసుకొచ్చాం. బోర్డింగ్, లాడ్జింగ్..పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుంది. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి ఒక్క చదువే. ’’ అని సీఎం వివరించారు.
* కరోనాపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవల్ని స్మరిస్తూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి నిర్మించిన ఈ గీతాన్ని ప్రగతిభవన్‌లో ఆయన ఆవిష్కరించారు. కరోనాపై అవగాహన గీతాన్ని కందికొండ రాయగా.. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ గీతం ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు.
* కరోనా వైరస్ మహమ్మారి విషయంలో తాము ప్రపంచ దేశాలన్నింటినీ ముందే హెచ్చరించామని.. స్పందించి, జాగ్రత్తపడిన దేశాలు మిగిలిన వాటి కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ తెలిపారు. తమ సలహాలను పెడచెవిన పెట్టకుండా ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30 నాడే అంతర్జాతీయంగా కొవిడ్-19 అత్యవసర పరిస్థితి ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
* కొవిడ్-19 ర్యాపిడ్ టెస్టు కిట్ల పనితీరు, ఫలితాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని చైనా తెలిపింది. ఈ కిట్లను ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ రాష్ట్రాలను ఆదేశించడంతో సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. గ్వాంఝౌ వోండ్ఫో బయోటెక్, ఝుహై లివ్జోన్ డయాగ్నస్టిక్స్ కంపెనీల నుంచి భారత్ 5 లక్షల యాంటీబాడీ ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. ఫలితాల్లో చాలా తేడాలు కనిపించడంతో వీటిని ఉపయోగించడం ఆపేయాలని ఐసీఎంఆర్ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
* గడచిన ఏడురోజుల్లో దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగంలోని పలు స్వయంప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ యూనిట్ల(పీఎస్‌యూ) అధికారులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంలో 80జిల్లాల్లో గతవారం రోజులుగా కొత్త కేసులు నమోదుకాలేదని స్పష్టం చేశారు.