* హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని చికెన్, మటన్ దుకాణాలపై పశు సంవర్థక శాఖ దాడులు కొనసాగుతున్నాయి. నాలుగైదు రోజులుగా ఆ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బేరిబాబు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం ఈ తనిఖీలు చేస్తోంది. బుధవారం సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అస్మత్‌పేట్, రాంనగర్, కూకట్‌పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో 13 దుకాణాల్లో ఈ బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. కరోనా నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా పరిశుభ్రత, నాణ్యత, లైసెన్సులు లేకుండా నడుపుతూ అధిక ధరలకు మటన్, చికెన్ విక్రయిస్తున్న ఆరు దుకాణాలను సీజ్ చేశారు. అస్మత్‌పేట స్పెన్సర్ మాల్‌లో మటన్ ఎక్కడి నుంచి తెస్తున్నారో చూపలేకపోయినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన మాంసాన్ని స్టిక్కర్ మార్చేసి మరునాడు కూడా విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్ తీసుకుని విక్రయిస్తున్న దృష్ట్యా మాల్‌ను జప్తు చేశారు. రాంనగర్‌లో లైసెన్సు లేకుండా నడుపుతున్న మటన్ దుకాణం మూసివేయించారు. మటన్ కిలో రూ.700, చికెన్ రూ.172కు మించి విక్రయిస్తే ఫిర్యాదు చేయాలని డాక్టర్ బేరిబాబు ప్రజలకు సూచించారు.
* లాక్‌డౌన్ తర్వాత రైలు ఎక్కాలంటే 2 గంటలు ముందుగా స్టేషన్‌కు రావాల్సిందే. మాస్కు ధరించి, పరీక్షలు చేయించుకుని ఏవిధమైన ఆరోగ్య సమస్యలు లేవని తేలితేనే రైల్లోకి అనుమతిస్తారు. బుకింగ్ కౌంటర్‌వద్ద వ్యక్తిగత దూరం పాటిస్తూ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు.
* నగరంలో ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రిలో మే 1 నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కరోనా దృష్ట్యా రోగులకు ఉచితంగా టెలీమెడిసిన్ చికిత్స అందించనున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రూమటాలజీ నిపుణులు టెలీమెడిసిన్ సేవలందించనున్నారు. 040-23489244కి ఫోన్ చేస్తే ఆస్పత్రి సిబ్బంది అపాయింట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సలహాలు ఇవ్వనున్నారు.
* దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో జాతీయ అర్హత పరీక్ష (నీట్) మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మైనారిటీ విద్యాసంస్థలు, డీమ్డ్ యూనివర్శిటీలు, ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది. దీని వల్ల విద్యార్థులను చేర్చుకోవడంలో ఆయా విద్యాసంస్థలకు ఉన్న ప్రత్యేక హక్కులకు ఎలాంటి భంగం కలగదని వ్యాఖ్యానించింది. ‘‘నీట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించడం వల్ల మైనారిటీ విద్యాసంస్థల హక్కుల్లో ఎలాంటి మత, భాషాపరమైన ఉల్లంఘలను చోటుచేసుకోవు. ప్రస్తుతం విద్య స్వచ్ఛంద సేవ అనే స్వభావాన్ని కోల్పోయి, ఒక వస్తువుగా మారిపోయింది. వ్యవస్థలో ఉన్న చెడును తొలగించి, అవినీతిని రూపుమాపడం కోసం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నీట్ ప్రవేశపెట్టబడింది. ఇప్పటికీ ప్రవేశాల ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది’’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎమ్. ఆర్. షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
* భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విటర్ ఖాతాలను వైట్‌హౌజ్ అన్‌ఫాలో చేసింది. అమెరికాలోని భారత దౌత్యకార్యాలయం ఖాతానూ అనుసరించడం మానేసింది. ఇందుకు గల కారణాలేంటో వెల్లడించలేదు. మూడు వారాల క్రితం వైట్‌హౌజ్ అనుసరిస్తున్న ఏకైక ప్రపంచ నేతగా ప్రధాని మోదీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
* కరోనా విపత్తు వేళ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విపత్తుల సమయాల్లో తెదేపా వెన్నంటి నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలన్నారు. పేదలను, కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతులకు సాయమందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
* ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జనసమితి ఉద్యమిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెజస రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించిన రెండేళ్ల కాలంలో ప్రజల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో నిరుద్యోగం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల సమస్యలపై ఉద్యమిస్తూ పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు. తాలు పేరుతో కోత విధించడం సరి కాదన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పలువురు తెజసా నాయకులు సామాజికదూరం పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* రాజదాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. కష్టా్ల్లో ఉన్నవారిని కేసుల పేరిట వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా కాలంలోనూ సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని.. వారిని పాత కేసుల పేరుతో పోలీస్ స్టేషన్‌లకు తీసుకువెళ్లడం తగదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలపై సానుభూతి చూపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
* రాష్ట్రంలో గాలి వాన వల్ల దెబ్బతిన్న పంటల గుర్తించడం సహా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్ దృష్ట్యా రైతులు పండిచిన ధాన్యం సహా ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కట్టడికి మరింత పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలుచేయాలని, రెడ్‌జోన్లలో ఆర్టీసీ బస్సుల ద్వారా కూరగాయలు ఇంటివద్దకే పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కరోనా నివారణా చర్యలు, ప్రభావిత రంగాల్లో పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.