ఓలా, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు క్రెడిట్‌కార్డు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. పెద్దబ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ అంశంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. దీని ద్వారా తమ కార్డు వినియోగదారుల ఖర్చులపై ఒక అంచనాకు రావడంతో పాటు క్రెడిట్ కార్డ్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. భారత్‌లో ట్యాక్సీ సేవలు అందించే ఓలా.. క్రెడిట్ కార్డు సిస్టంను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. తొలి ఏడాది ఒక మిలియన్ కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ కూడా యాక్సిస్ బ్యాంక్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో వినియోగదారులకు క్రెడిట్ కార్డులను త్వరలో అందించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే ‘బై నౌ.. పే లేటర్’ అనే విధానాన్ని తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. గతేడాది అక్టోబర్‌లోనే అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్‌తో జట్టు కట్టి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది.
ఓలా క్రెడిట్ కార్డులు వచ్చేస్తున్నాయి
Related tags :