Editorials

నాకు ఆ లొసుగులు అన్నీ తెలుసు

Trump Claims He Knows The Origins Of COVID19

మహమ్మారి కరోనా వైరస్‌కు వుహాన్‌లోని ల్యాబ్‌కు సంబంధాలున్నట్టు తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ప్రాణాంతక అంటువ్యాధి పుట్టుకకు కారణమైన చైనాపై నూతన టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. అంటువ్యాధి కోవిడ్‌కు వుహాన్ ప్రయోగశాలను అనుసంధానించే సాక్ష్యం తాను చూశానని చెప్పుకొచ్చారు. కోవిడ్‌పై డ్రాగన్‌ దేశం పారదర్శకంగా వ్యవహరించలేదని ట్రంప్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. కాగా, కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించడంతో.. గత ఆరు వారాల్లోనే 30 మిలియన్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. దేశ ఆర్థిక రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సర్కార్‌ చైనాపై విమర్శలు ఎక్కుపెట్టింది. మరోవైపు కరోనా విపత్తుతో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో చీకటి నెలకొంటుందని, యూరప్‌లో కూడా ముందెన్నడూ లేని ఆర్థిక విపత్తు తలెత్తుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ దాడిలో రెండు లక్షల 30 వేల మంది మరణించగా.. 63 వేల మరణాలతో అమెరికా టాప్‌లో ఉంది. దాదాపు ప్రపంచంలోని సగం జనాభా లాక్‌డౌన్‌ నిబంధనలతో ఇళ్లకే పరిమితమైంది. ఇదిలాఉండగా.. గతేడాది వుహాన్‌లోని మాంసం మార్కెట్‌లో కోవిడ్‌ పుట్టుకొచ్చిందని కొందరు భావిస్తుండగా.. ఓ ల్యాబ్‌లో గబ్బిలాలపై పరిశోధనలు చేస్తుండగా వైరస్‌ బయటిపడిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. వైరస్‌ పుట్టుకొచ్చిన తొలినాళ్లలో చైనా పారదర్శకంగా వ్యవహరించకపోవడంతోనే ప్రపంచం నెత్తిన కరోనా పిడుగై పడిందనే విమర్శలున్నాయి.