DailyDose

మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు-TNI బులెటిన్

Indian Home Ministry Extends Corona Lock Down Until May 17th

* భారత్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండటంతో కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. కరోనా నియంత్రణే లక్ష్యంగా మరో రెండోవారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్-3‌ కొనసాగనుందని స్పష్టం చేసింది.

* కరోనా విజృంభణ వేళ విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10గంటలకు ఆయన మాట్లాడనున్నారు. కరోనా కట్టడి చర్యల కొనసాగింపుపై కీలక ప్రకటన చేయనున్నారు.

* భారత్‌లో కరోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 1755 కొత్త పాజిటివ్‌ కేసులు; 77 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా 35,365 మందికి ఈ మహమ్మారి సోకితే.. వారిలో 9065 మంది కోలుకోగా.. 1152 మంది మృత్యువాతపడ్డారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తోంది. 10498 మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 1773 మంది కోలుకోగా 459 మరణాలు నమోదయ్యాయి.

* రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలును సమాజంలోని అన్ని వర్గాలూ ప్రశంసించాయని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా కేసులు, మరణాలు దాస్తే దాగేవి కాదన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే కింగ్‌ కోఠి ఆస్పత్రికి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా వస్తే చనిపోతామన్న ఆందోళన ఎవరికీ వద్దన్నారు.

* తెలంగాణలో కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1044కి చేరింది. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు 24మంది డిశ్చార్జి అయ్యారు.