NRI-NRT

హమ్మయ్యా!

USCIS Delivers Good News For H1B Holders

అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న వారు, హెచ్‌-1బీ వీసాదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. వివిధ కారణాల కింద నోటీసులు అందుకున్న గ్రీన్‌ కార్డు, హెచ్‌-1బీ వీసాదారులు స్పందించేందుకు ఇచ్చిన గడువును 60 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వారు మరో 60 రోజుల వరకు అవసరమైన పత్రాలు సమర్పించుకునే వెసులుబాటు కలుగుతుంది. నోటీసుల్లో పేర్కొన్న చివరి తేదీ తర్వాత 60 రోజుల వరకు వీరిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఇమిగ్రేషన్‌ కార్యాలయాలు మూతపడ్డ విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి సమర్పించాల్సిన అనేక పత్రాలు, వీసాకు సంబంధించిన ఇతర ప్రక్రియలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అక్కడి ప్రభుత్వం 60 రోజుల అదనపు సమయాన్ని కల్పించింది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) వివరాల ప్రకారం.. వీసా కొనసాగింపు(ఎన్‌-14), తిరస్కరణ నోటీసు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగింపు నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీసు‌, నోటీస్‌ ఆఫ్‌ అప్పీల్‌ ఆర్‌ మోషన్‌ వంటి తదితర నోటీసుల విషయంలో స్పందించడానికి ఈ అదనపు సమయం వర్తిస్తుంది. తమ దేశంలో పనిచేస్తూ.. కరోనా కట్టడి ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న వారిని రక్షించుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. కరోనా దెబ్బకు అమెరికాలో పలు కంపెనీలు తాత్కాలికంగా మూతపడటంతో ఈ ఏడాది జూన్‌ చివరిలోగా రెండు లక్షల మందికిపైగా ఉద్యోగులు చట్టబద్ధమైన హోదాను కోల్పోయే ముప్పుందని ఇమిగ్రేషన్‌ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు. అమెరికాలో గ్రీన్‌కార్డు పొందేందుకు ప్రయత్నిస్తున్న విదేశీ నిపుణుల సంఖ్య ప్రస్తుతం దాదాపు 2.5 లక్షలుగా ఉంది. వారిలో హెచ్‌-1బీ వీసాదారులే రెండు లక్షల మంది వరకు ఉంటారు. నిబంధనల ప్రకారం.. హెచ్‌-1బీ వీసాదారులు వేతనాలు పొందకుండా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండొద్దు. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోతే.. 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. లేదా వేరే వీసా విభాగంలోకి మారాలి. ఇవేవీ చేయలేకపోతే స్వదేశాలకు తిరుగు ప్రయాణమవ్వాలి. ఈ నేపథ్యంలో 2 లక్షల మంది హెచ్‌-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులపై చట్టబద్ధ హోదా కత్తి వేలాడుతోందని అంచనా. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి ప్రభుత్వం ఇచ్చిన 60 రోజుల గడువు వల్ల వీరందరికీ భారీ ఊరట లభించినట్లైంది.