Agriculture

నల్ల బియ్యం చాఖావోకు అరుదైన గుర్తింపు

Manipur Black Rice Chakavo Gets Recognition

‘చాఖావో’గా ప్రసిద్ధి గాంచిన మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌కు అరుదైన గుర్తింపు లభించింది. మణిపూర్‌ బ్లాక్‌రైస్‌ భౌగోళిక సూచిక(జిఐ) ట్యాగ్‌ పొందినట్లు శుక్రవారం అధికారిక వర్గాలు ప్రకటించాయి. భౌగోళిక సూచిక తమ అధికారిక వెబ్‌సైట్‌లో మణిపూర్ బ్లాక్ రైస్ పేరిట నమోదు చేసిన నివేదికను అధికారులు ధృవీకరించారు. మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌కు జిఐ ట్యాగ్‌ ఇవ్వాలంటూ మణిపూర్ లోని చాఖావో (బ్లాక్ రైస్) కన్సార్టియం ప్రొడ్యూసర్స్ ఏడాది కిందట దరఖాస్తు చేసింది. దీనికి వ్యవసాయ శాఖ, మణిపూర్ ప్రభుత్వంతో పాటు నార్త్ ఈస్టర్న్ రీజినల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్దతుగా నిలిచాయి.రాష్ట్ర వ్యవసాయ శాఖ బృంద సభ్యుల డాక్యుమెంటేషన్‌తో సహా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పట్టిందని అధికారులు వివరించారు. ఒక నిర్ధిష్ట ప్రాంతం నాణ్యత కలిగిన ఉత్పత్తి చేస్తున్న వస్తువును గుర్తించి భౌగోళిక సూచిక(జిఐ ట్యాగ్‌) ఇవ్వడం జరుగుతుంది. అంతేగాక వాణిజ్యంలో ప్రధానపాత్ర పోషించడానికి జిఐ ట్యాగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు సంప్రదాయంగా ఆచరిస్తున్న నైపుణ్యాలను కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది.ఇదే విషయమై ప్రాజెక్ట్‌ కో- ఆర్డినేటర్‌, మణిపూర్‌ అగ్రి బిజినెస్‌ కన్సార్టియమ్‌ అధికారి ఎమ్‌ఎస్‌ ఖైదెం మాట్లాడుతూ.. మణిపూర్‌ బ్లాక్‌రైస్‌ జిఐ ట్యాగ్‌ను పొందడం అరుదైన విషయమన్నారు. ఇప్పుడు బ్లాక్‌రైస్‌ విత్తనాలను ప్రపంచంలో ఎక్కడైనా అమ్మే శక్తి తమకు ఉందన్నారు. వాణిజ్య పరంగా మంచి అవకాశాలు ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు తాము అధిక ప్రోటీన్ కంటెంట్ స్థానిక బఠానీ రకం ‘హవాయి-తారక్ మఖ్యాత్ముబి’ కి జిఐ ట్యాగ్‌ లభించే విధంగా ప్రక్రియను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖైదెం పేర్కొన్నారు. శతాబ్దాలుగా మణిపూర్‌లో సాగులో ఉన్న చాఖవో అనే సువాసన గల గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విందులో వండుతారు. దీనిని ‘చాఖావో ఖీర్’ ‌గా కూడా పిలుస్తుంటారు. అక్కడి వైద్య నిపుణులు చాఖావోను సంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతుంటారు. మణిపూర్‌ బ్లాక్‌రైస్‌ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్‌ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.