కరోనా మహమ్మారి కారణంగా దేశంలో మరణించే వారి సంఖ్య లక్షలోపే ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. శుక్రవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా పెద్ద సంఖ్యే అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే ట్రంప్ మరణాల సంఖ్య 60 నుంచి 70 వేల వరకు ఉండొచ్చని సోమవారం పేర్కొనడం గమనార్హం. శ్వేతసౌధంలోని కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ కో-ఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిర్క్స్ మార్చి 29న మాట్లాడుతూ.. భౌతిక దూరం పాటించినప్పటికీ సుమారు లక్ష నుంచి 2.40 లక్ష మంది ఈ మహమ్మారి కారణంగా మరణించొచ్చని అంచనా వేశారు. ఎలాంటి భౌతిక దూరమూ పాటించకుండా, చేతులు శుభ్రం చేసుకోకపోతే ఈ సంఖ్య 15 నుంచి 22 లక్షల వరకు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే చాలా మందిని కోల్పోయాం. అయినా 22 లక్షల మంది చనిపోతారని అంచనా ఉంది. కానీ 60 నుంచి 70 వేల మంది చనిపోయే అవకాశం ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం నాటికి మరణాల సంఖ్య 60వేల మార్కును దాటేసిన నేపథ్యంలో ఆ సంఖ్యను ట్రంప్ లక్షకు పెంచారు. ఆర్థిక వ్యవస్థను నిలిపివేయడం వల్ల లక్షల ప్రాణాలు కాపాడగలిగామని పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు 11 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడగా.. 65 వేలమందికి పైగా మరణించారు.
లక్ష లోపే ఉంటారు…
Related tags :