‘బార్బర్ షాప్ గర్ల్స్’ పేరు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో బాగా మర్మోగిపోతోంది. దీనికి తోడు వీరికి జిల్లెట్ సంస్థ కూడా కాస్త ప్రచారం కల్పించింది. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ కూడా వీరికి బాసటగా నిలిచాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బన్వారీ తోలా అనే మారుమూల ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నేహా, జ్యోతి సెలూన్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సచిన్ వారికి సాయంగా నిలవాలనుకున్నాడు. వారిని కలిసి వారితో షేవింగ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘మీకు తెలియదేమో..ఇది నాకు తొలిసారి..నేను ఇంతకుముందు ఎవరితోనూ షేవింగ్ చేయించుకోలేదు. కానీ ఆ రికార్డు నేడు చెరిగిపోయింది. దీన్ని నేను మర్చిపోలేను. బార్బర్‌షాప్‌గర్ల్స్‌ను కలిసే కార్యక్రమంలో భాగంగా వారితో షేవింగ్ చేయించుకున్నాను. దీంతో పాటు వారికి జిల్లెట్ ఇండియా వారిచ్చిన స్కాలర్‌షిప్ కూడా అందించాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చి ఫొటోలను పంచుకున్నాడు. దీంతో సచిన్‌పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం యూపీలోని బన్వారీ తోలా అనే మారుమూల ప్రాంతానికి చెందిన నేహా, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు..తమ తండ్రికి సాయం చేయడానికి షేవింగ్, కటింగ్ నేర్చుకున్నారు. తాత్కాలిక సాయం కోసం నేర్చుకున్న ఈ పని కాస్తా వారి జీవనాధారం అయింది. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడానికి కత్తెర పట్టిన ఈ అక్కాచెల్లెళ్లు..ఓ వైపు చదువుకుంటూ మరోవైపు సెలూన్ నిర్వహించడం అలవాటుగా మార్చుకున్నారు. వీరి విషయం కాస్తా ఆ నోటా ఈ నోటా పడి జిల్లెట్ సంస్థ వరకూ వెళ్లింది. వీరి పనిని మెచ్చిన ఆ సంస్థ వీరి కథతో చిన్న యాడ్ చేసింది. ఇది విపరీతంగా వైరల్ అయింది. దీంతో సచిన్ కూడా ఈ అక్కాచెల్లెళ్లు చేస్తున్న పనిని ప్రశంసించాడు. వారికి మద్దతుగా నిలవడం కోసం వారి వద్ద షేవింగ్ చేయించుకున్నాడు.
సమానత్వానికి సచిన్ సాయం
Related tags :