ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. ఎప్పుడు ఏవైపు నుంచి కమ్ముకొస్తుందో తెలియని ఈ మహమ్మారి ఇప్పటి వరకు 90వేల మందికి పైగా వైద్య, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సోకినట్టు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసీఎన్) సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనాతో 260 మంది నర్సులు ప్రాణాలు కోల్పోయారని తెలుపుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రక్షణ పరికరాల కొరత ఇలాగే కొనసాగితే మాత్రం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రోగుల నుంచి వైద్య సిబ్బందికి ఈ మహమ్మారి సోకకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కోరింది. చైనాలోని వుహాన్ నగరంలో ఉద్భవించిన ఈ కరోనా మహమ్మారి బారినపడి గత నెలలో 100 మంది నర్సులు మృత్యువాతపడ్డారని తెలిపింది. ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో ఈ వైరస్ 23 వేల నుంచి 90వేలకు పైగా పెరిగినట్టు అంచనా వేస్తున్నామని ఐసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హౌవార్డ్ కాటన్ అన్నారు. కేవలం 30 దేశాల్లోని నర్సింగ్ అసోసియేషన్లు, ప్రభుత్వ, మీడియా నివేదికల ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారమే 90వేల మందికి సోకిందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఐసీఎన్ 130 దేశాల్లో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. 20 మిలియన్ల మంది నర్సులో అందులో రిజిస్టర్ అయి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3.5 మిలియన్ల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీరిలో 6శాతం వైద్య సిబ్బందే ఉంటారని అంచనా వేస్తున్నట్టు కాటన్ పేర్కొన్నారు. అలాగైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2లక్షలకు పైగా ఈ మహమ్మారి బారిన పడి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. గత నెల 11 నాటికి 22 వేల మంది హెల్త్ వర్కర్లు కరోనా బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.
లక్షమంది వైద్య సిబ్బందికి కరోనా
Related tags :