నేడు ఆత్రేయ జయంతి
ఆత్రేయ అనగానే అందరికీ గుర్తొచ్చేది సభంగ శ్లేషతో కూడిన ఆయన ముద్దుపేరు మన-సుకవి. తెలుగు సినిమాల్లో ఆత్రేయ మనసు పాటలతో పాటు తనదైన ముద్రగల వలపు పాటలు, వానపాటలు, వీణ పాటలు, అమ్మ పాటలు, అభ్యుదయ గీతాలు, తాత్విక గీతాలు మొదలైనవి రాశారు. వాటిలో తాత్విక గీతాలను పరిశీలిస్తే ఆత్రేయను ‘సినీ వేమన’ అని ఎందుకన్నారో తెలుస్తుంది. సామాన్యులకు అర్థమయ్యే తేలికైన పదప్రయోగం వల్లనే కాదు, నిత్య జీవితంలో జనం సామెతల్లా, లోకోక్తుల్లా వాడుకునే పంక్తులను తన పాటల్లో మెరిపించడం వల్ల కూడా ఆత్రేయకు వేమనతో పోల్చే అర్హత ఉంది.
సినీకవులు తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి కథలో అనువైన సన్నివేశాలు దొరకాలి. అటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకుని తన జీవితానుభవాన్ని రంగరించి తనకు కరతలామలకాలైన మాటల పొదుపుతో, అదుపుతో జనం నోళ్లలో నానేలా ఆత్రేయ తత్త్వ గీతాలను రచించారు. ఇందుకు ఆత్రేయ మనసుకు చెప్పిన భాష్యాలే నిదర్శనాలు
1. ‘‘మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే
మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ (ప్రేమనగర్)
2. ‘‘మనసు లేని బతుకొక నరకం
మరపులేని మనసొక నరకం’’ (సెక్రటరీ)
3. ‘‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!’’
(ప్రేమలు-పెళ్లిల్లు)
పై ఉదాహరణల్లో మనిషికి మనసెంత ముఖ్యమో, కానీ ఆ మనసున్న మనిషి ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఆత్మీయంగా, అనుభవైకవేద్యంగా చెప్పారు ఆత్రేయ. చివరి ఉదాహారణాల్లో దేవుడు మనిషికి మనసిచ్చి ఆ మానసిక మథనాన్ని చోద్యంగా చూస్తున్నాడనడం కళ్లు చెమ్మగిల్లే అక్షరీకరణం!
మనసెంత చంచలమైనదో, మాయలాడో- అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో విశ్లేషించిన ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికవేత్తలా అనిపిస్తాడు.
‘‘కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!’’ (గుప్పెడు మనసు )
అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి తల పట్టుకున్న ఆత్రేయ మరో సందర్భంలో మనసు నిత్యమనీ, అది జన్మజన్మల బంధమనీ భావించారు.
‘‘మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది
మనసు తోటి మనసెపుడో కలిసిపోతది ’’(మూగ మనసులు)
‘కర్మ చేయడమే నీ వంతు, ఫలితం దైవాధీనం’ అనే భగవద్గీత వాక్యాన్ని ఆత్రేయ విశ్వసించేవారు. ఆయన కొన్ని పాటల్లో దైవం ఉనికిని ప్రశ్నించినా, ‘తానొకటి తలిస్తే.’ అనే సామెతకు కట్టుబడ్డారు. ఆ దృష్టితోనే సందర్భానుసారంగా ఆత్రేయ రాసిన-
1. ‘‘అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’’(మురళీ కృష్ణ)
2. ‘‘తలచినదే జరిగినదా – దైవం ఎందులకు?
జరగనిదే తలచితివా – శాంతి లేదు నీకు’’ (మనసే మందిరం )
మొదలైన పాటలు తెలుగు నాట నానుడిగా, ఓదార్పుగా నేటికీ వినిపిస్తున్నాయి. వీటిలో కొన్నిటికీ తమిళ మాతృకలున్నా, తెలుగులో ఆత్రేయ బాణీలో అవి ఒదిగి సొంతమయ్యాయి.
కథకు అన్వయిస్తూ ఆత్రేయ విధి ఆడే వింత నాటకాన్ని కళ్లకు కట్టించిన గొప్ప పాట-
‘‘ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరు సొంతము ? ఎంతవరకీ బంధము? ’’(జీవన తరంగాలు )
అనేది ఐహిక బంధాలు అశాశ్వతమని ప్రబోధించి వైరాగ్యాన్ని కలిగించే ఈ పాట ఓ మణిపూస.
కవితాత్మకమైన స్పర్శతో, అద్భుతమైన భావుకతతో ఆత్రేయ రచించిన ఆణిముత్యాల్లాంటి తత్త్వగీతాలకు మచ్చుతునకలు
1. ‘‘నవ్వినా.. ఏడ్చినా.. కన్నీళ్లే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా’’ (మూగ మనసులు)
2. ‘‘లేనిది కోరేవు – ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యగములు పొగిలేవు’’ (గుప్పెడు మనసు )
వీటిలో మొదటి పాట గురించి – ‘ఈ రెండు పంక్తులు ఇరవై కావ్యాల పెట్టు’ అని డాక్టర్ సి. నారాయణరెడ్డి ప్రశంసించారు.
రెండో పాట జీవితంలో అందరూ చేసే పొరపాట్లకూ, పశ్చాత్తాపాలకూ అక్షర భాష్యం.
అందరికీ తెలిసిన విషయాన్ని తీసుకుని సినిమా మాధ్యమం ద్వారా కొందరికైనా కనువిప్పు కలిగించే అభిప్రాయంతో ఆత్రేయ రాసిన సామాజిక ప్రయోజనం గల చక్కెర మాత్రల్లాంటి పాటలకు ఉదాహరణ –
బ్రాంది, విస్కీ, రమ్ము, జిన్ను రకరకాల మధువులు
భార్యాభర్తలు, తల్లీపిల్లలు పలు రకాల బంధాలు
ఎవరైనా రుణం తీరే వరకే
ఆపై మిగిలేదేముంది? – ఖాళీ సీసాలు, కాలిన బూడిదలు!
(పుట్టింటి గౌరవం )
ఇలాంటి పాటను ఆత్రేయ రాయగలరు. దీనికి వివరణ అవసరం లేదు.
వ్యాపార ప్రక్రియ అయిన సినిమా మాధ్యమంలోని పాటల్లో కూడా తన అంతరంగాన్ని ఆవిష్కరించి మనిషికీ మనసుకీ కొత్త భాష్యాలు చెప్పిన ఆచార్య ఆత్రేయ ఓ అక్షర యోగి!