Movies

ఎగిరాను…కిందపడ్డాను

Tamannah Regrets Her Bollywood Choices

ఒకానొక సమయంలో తాను కథానాయికగా నటించిన ఓ బాలీవుడ్‌ సినిమా పరాజయమైందని.. అప్పట్లో అది తనకో పెద్ద దెబ్బ అని నటి తమన్నా అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి విశ్రాంతి దొరకడంతో ఇంటికే పరిమితమైన తమన్నాను తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియా వారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా తమన్నా బాలీవుడ్‌లో తన కెరీర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కథానాయికగా నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన చిత్రం ‘హిమ్మత్‌వాలా’. బాక్సాఫీస్‌ వద్ద ఆ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. ఆ సినిమా పరాజయం కెరీర్‌పరంగా నాకో పెద్ద దెబ్బ. అంతేకాకుండా నా జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం కూడా అదే. అయితే ఆ సినిమా పరాజయం చెందిన సమయంలో నేను వేర్వేరు ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. వరుస షూటింగ్స్‌ కారణంగా నేను బాలీవుడ్‌ సినిమా పరాజయం గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఒకేసారి 4-5 సినిమాల్లో పనిచేయడం వల్ల ఈ సినిమా విజయం సాధించలేదు లేదా ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది అనే విషయాన్ని కూడా నేను ఆలోచించలేకపోయేదాన్ని. అయినా సరే ఆ సినిమా పరాజయం అనేది ఏదో ఒక రకంగా మంచికే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలని అర్థమైంది.’ అని తమన్నా తెలిపారు.