ఆ ఊరి పొలిమేరలకు వెళితేనే మత్తుగొలిపే అత్తరు పరిమళాలు ముక్కుపుటాలను తాకుతాయి. అక్కడి గాలి గంధపు సువాసనలతో మనసును తేలిక పరుస్తుంది. ఇక, ఆ పట్టణంలోకి అడుగుపెడితే వందల సుగంధాలు నన్ను వాసన చూడమంటే నన్ను చూడమంటూ వరసకడతాయి. అదే భారతదేశపు అత్తరు రాజధానిగా పిలిచే కన్నౌజ్ పట్టణం. రెండు వందల రూపాయలు మొదలు 50 లక్షల రూపాయల దాకా ఖరీదు చేసే రకరకాల ఆర్గానిక్ అత్తరులు తయారవుతాయక్కడ. కాలేజీకి వెళ్లే అమ్మాయి దగ్గర నుంచీ తెల్ల పంచె కట్టుకునే తాతయ్యల దాకా స్నానం చేయగానే పెర్ఫ్యూమ్ రాసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ సుగంధం మన మనసును చాలాసేపు ఆహ్లాదంగా ఉంచుతుంది. అయితే ఇలాంటి అత్తరు తయారీకే ప్రత్యేకంగా ఒక ఊరు ఉందని మీకు తెలుసా… అది కూడా భారతదేశంలోనే! దాని గురించి తెలుసుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. ఇక్కడి కన్నౌజ్ పట్టణంలో వీధివీధికీ ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అక్కడ 200కు పైగా పెర్ఫ్యూమ్ డిస్టిలరీలు ఉన్నాయి మరి. ఈ ఊరు దాదాపు ఏడో శతాబ్దం నుంచీ అత్తరు తయారీలో పేరు పొందింది. మొఘల్ చక్రవర్తులు ఇక్కడి అత్తరంటే ఎంతో ఇష్టపడేవారట. అంతేకాదు, దేశ విదేశాల్లోనూ ఇక్కడ తయారు చేసే అత్తరుకు ఎందరో అభిమానులున్నారు. మరి, ఈ ఊరి అత్తరులో ప్రత్యేకత ఏంటంటే…
కన్నౌజ్ వెళితే సుమారు 30 తరాల నుంచీ పెర్ఫ్యూమ్ తయారీలో ఉన్న కుటుంబాలు కనిపిస్తాయి. ఇక్కడ ఎటువంటి రసాయనాలూ లేకుండా అచ్చంగా సేంద్రియ అత్తరును తయారు చేస్తారు. దాని తయారీ విధానమూ ఈ ఊరికి మాత్రమే ప్రత్యేకం. ఈ అత్తరును చేసేందుకు ముందుగా… గులాబీ, జాజి, చామంతి, బంతి… ఇలా రకరకాల పూలను పెద్ద మొత్తంలో సేకరిస్తారు. ఆ పూలను దెగ్లుగా పిలిచే ఒక పెద్ద రాగి పాత్రలో వేసి కొంచెం చల్లటి నీళ్లను కలుపుతారు. ఈ పాత్ర కింద కట్టెలు లేదా పిడకలతో మంట పెడతారు. ఇక పాత్రలో నుంచి వచ్చే ఆవిరి ఒక వెదురు గొట్టం ద్వారా దప్కా అని పిలిచే మరో చిన్న పాత్రలోకి వెళుతుంది. ఆ పాత్ర నీళ్లలో ఉంటుంది. ఏడెనిమిది గంటల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించాక, ఆ ఆవిరి చిన్న పాత్రలోకి వచ్చి శీతలీకరణం చెంది అక్కడ నూనెగా మారుతుంది. దీనికి మనకు కావలసిన అత్తరు రకాన్ని బట్టి ఎసెన్షియల్ ఆయిల్, లేదా శాండల్ఉడ్ ఆయిల్‌ను వివిధ మోతాదుల్లో కలుపుతారు. ఈ పద్ధతిలో మనం వాడే ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజుల సమయం పడుతుంది. ఇలా తయారు చేసిన అత్తరు పరిమళం రోజంతా ఒంటికి అంటుకుని ఉంటుందట. కన్నౌజ్‌లో తయారయ్యే వాటిలో తొలకరి మట్టి వాసనతో ఉండే అత్తరు ప్రత్యేకమైనది. దీని కోసం పూలకు బదులు అక్కడి మట్టి పెళ్లలను పాత్రల్లో వేసి ఆ వాసనను ఎంతో చాకచక్యంగా అత్తరు గుబాళింపుగా మారుస్తారు. ఇక్కడ మరింత ప్రత్యేకమైనది గులాబీలతో తయారయ్యే రూహ్ అల్ గులాబ్. దాదాపు ఎనిమిది వేల కిలోల గులాబీల నుంచి ఈరకం ఒక కిలో అత్తరు తయారవుతుంది. అందుకే, దీని విలువ పదమూడు లక్షల రూపాయల పైచిలుకే పలుకుతుంది. ఇక, ఇక్కడి ప్రత్యేకమైన మరో రకం… ఊద్ అత్తర్. అగర్వుడ్తో చేసే ఈ అత్తరు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అత్తర్లలో ఒకటి. కిలో యాభై లక్షల రూపాయల దాకా పలికే దీన్ని అరబ్ దేశాలకు చెందిన ధనిక కుటుంబాల వాళ్లు ఇక్కడి నుంచి ఎంతో ఇష్టంగా తెప్పించుకుంటారు. అందుకే ఈ పట్టణానికి భారతదేశపు అత్తరు రాజధానిగా భౌగోళిక గుర్తింపూ వచ్చింది. అంతేకాదు, ఇక్కడ అత్తరు మ్యూజియాన్నీ నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి అత్తరు అరబ్ దేశాలతో పాటు, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్ తదితర 57 దేశాలకు ఎగుమతి అవుతోంది. సాధారణ ప్రజలు వాడేందుకు వీలుగా రెండు మూడు వందల రూపాయల ఖరీదుతోనూ ఈ అత్తరులను తయారు చేస్తున్నారు. మనమూ ఇక్కడి పరిమళాలను ఆస్వాదించాలనుకుంటే www.kannaujattar.com వెబ్సైట్లోకి వెళ్తే సరి!