Business

మందు కొంటే ఇంకు చుక్క వేస్తారు

Madhyapradesh Liquor Shops Marks Buyers With Ink

మందుబాబులను గుర్తించేందుకు మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న విధానాన్ని అవలంభిస్తోంది. మద్యం కొనేవారి చేతి వేలిపై ఇంకు చుక్క పెడుతున్నారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి అభిషేక్‌ తివారి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘మద్యం కొనుగోలు చేయడానికి వచ్చేవారి చూపుడు వేలిపై ఇంకు చుక్క పెడుతున్నాం. సమీప భవిష్యత్తులో వారి వివరాలు కావాలంటే వెంటనే వారిని గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. దీంతో పాటుగా మందుబాబుల పేర్లు, చిరునామా, మొబైల్‌ ఫోన్‌ నంబర్లు మద్యం కాణంలోని రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించామ’ని తివారి తెలిపారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో 50 మద్యం దుకాణాలు తెరిచారని, షాపుల వద్ద పెద్దగా రద్దీ లేదని చెప్పారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించడంతో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3,138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 185 మంది చనిపోయారు. 1,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు.