కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా మీద తన విమర్శలకు పదును పెడుతూనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశం చేసిన ఘోర తప్పిదం వల్లో లేక చేతకానితనం వల్లో వైరస్ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తోందని విరుచుకుపడ్డారు. శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విమర్శలు చేశారు. ‘వైరస్‌ను ఒక పాయింట్ వద్ద ఆపి ఉండొచ్చు. దాన్ని మూలం వద్దే ఆపి ఉండొచ్చు. దాన్ని సులభంగా చేయొచ్చు. కానీ ఏదో జరిగింది.. ఏదో జరిగింది’ అని ట్రంప్ తన అనుమానాలను బయటపెట్టారు. ‘వారు ఏదో ఘోరమైన పొరపాటు చేసుంటారు. అది వారి చేతకాని తనం వల్ల కావొచ్చు. అది చాలా బాధాకరం’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఇప్పటి వరకు ఈ వైరస్ 180 దేశాల్లో వ్యాపించిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా చైనా నుంచి ఇప్పుడు, భవిష్యత్తులో రానున్న ప్రమాదాలను ఎదుర్కోడానికి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రిపబ్లిక్ నేత ఒకరు వెల్లడించారు. చైనా వైరస్ తీవ్రతను దాచిపెట్టడం వల్లే ఈ సంక్షోభానికి దారితీసిందని ఆయన మండిపడ్డారు. పైగా అమెరికాను తప్పుపడుతూ ప్రచారం చేస్తోందన్నారు. అలాగే వైరస్ వ్యాప్తికి కారణాలపై అంతర్జాతీయ నిపుణులతో దర్యాప్తు చేయడానికి ఆ దేశం సహకరించడం లేదన్నారు.
ఏదో జరిగింది..నన్ను అడగొద్దు!
Related tags :