కోవిడ్19 మహమ్మారికి SARS-CoV-2 వైరస్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతన్న విషయం తెలిసిందే. అయితే ఆ వైరస్ ఎలా పుట్టిందన్నదే ఇప్పుడు అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు చైనా శాస్త్రవేత్తలు ఓ కొత్త థియరీని కూర్చారు. నేచర్ జర్నల్‌లో దాని గురించి ప్రస్తావించారు. పంగోలియన్(అలుగు)లో ఉన్న వైరస్.. గబ్బిలాల వైరస్‌తో సంక్రమణ జరగడం వల్ల.. SARS-CoV-2 వైరస్ పుట్టినట్లు శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గ్వాంగ్‌డంగ్ ల్యాబరేటరీ ఫర్ లింగ్నన్ మాడ్రన్ అగ్రికల్చర్ పరిశోధకులు వైరస్ ఆవిర్భావం పై స్టడీ చేశారు. వైరస్ జన్యు క్రమాల్ని విశ్లేషిస్తూ వారు పరిశోధనలు చేపట్టారు.
నోవెల్ కరోనా వైరస్‌లో ఉన్న జన్యు సీక్వెన్స్ SARS-CoVకి దగ్గరగా ఉన్నది. ఇంకా గబ్బిలాల్లోని కరోనా వైరస్ RaTG13కి కూడా సమంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు మలయన్(మలేషియా) జాతికి చెందిన పంగోలిన్స్ కరోనా వైరస్‌ను కూడా పరిశోధకులు పరీక్షించారు. అయితే ఆ పంగోలిన్స్లోని ఈ, ఎం,ఎన్, ఎస్ జన్యవులు.. SARS-CoV-2తో పోలిస్తే 100 శాతం, 98. శాతం, 97.8 శాతం, 90.7 శాతం అమినో యాసిడ్ ఐడెంటిటీ ఉన్నట్లు గుర్తించారు. పంగోలిన్స్ కరోనా వైరస్‌లో ఉన్న ఎస్ ప్రోటీన్.. SARS-CoV-2తో పోలిస్తే ఒకేరకంగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ఈ రెండింటి మధ్య కేవలం నాన్‌క్రిటికల్ అమినో యాసిడ్ తేడా మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.
పంగోలిన్ కరోనా వైరస్‌ను స్టడీ చేస్తున్న సమయంలో.. సుమారు 25 మలయన్ పంగోలిన్స్‌ను అధ్యయనం చేశారు. వాటిల్లో 17 జంతువుల వైరస్లలో కరోనా జన్యువు ఒకేరకంగా ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. వైరస్ సోకిన పంగోలిన్స్.. SARS-CoV-2లోని ఎస్ ప్రోటీన్‌తో రియాక్ట్ అయినట్లు గుర్తించారు. దీంతో ప్రస్తుతం విజృంభిస్తున్న SARS-CoV-2 వైరస్‌కు పంగోలిన్స్ హోస్ట్ గా వ్యవహరించినట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు.